LOKESH: సీఐడీ విచారణకు హాజరైన నారా లోకేశ్
నిన్న సంబంధం లేని 49 ప్రశ్నలు అడిగారన్న యువనేత, నేడు కొనసాగనున్న విచారణ;
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేశ్ రెండో రోజూ విచారణకు హాజరయ్యారు. నిన్న తనను విచారణకు పిలిచిన CID అధికారులు 49 సంబంధం లేని ప్రశ్నలు అడిగారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చెప్పారు. అధికారుల నోటీస్ మేరకు నేడు కూడా ఆయన విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు అరెస్టు గురించి తెలియదంటున్న జగన్ DGP దగ్గర పాఠాలు నేర్చుకోవాలని లోకేశ్ చురకలు వేశారు. హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగు రోడ్డు ఎలైన్మెంట్ మార్చారంటూ అభియోగాలు మోపిన CID అధికారులు... సంబంధం లేని ప్రశ్నలు అడిగారని విచారణ తర్వాత లోకేశ్ చెప్పారు. విచారణలో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని లోకేశ్ తెలిపారు. చంద్రబాబు అరెస్టు గురించి తెలిదయంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మరోవైపు నిన్న లోకేష్‌కు మధ్యాహ్నం భోజనం తీసుకెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. లోకేష్ విచారణలో మధ్యాహ్నం గంటపాటు భోజన విరామం ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఐతే భోజనం తీసుకెళ్లే వాహనాన్ని చాలాసేపు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై పోలీసులు ఆపేశారు. తెలుగుదేశం నేతలు.. పోలీసులతో వాగ్వాదానికి దిగిన తర్వాత.. అనుమతించారు. ఇదే సమయంలో.... లోకేష్‌కు మద్దతుగా సిట్ కార్యాలయం వద్దకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తాడేపల్లి-పాతూరు రోడ్డులో పోలీసులు ఆంక్షలు పెట్టారు. సర్వీస్ రోడ్డు వద్దే బారికేడ్లు పెట్టడంతో అటుగా వెళ్లే ప్రజలు ఇబ్బంది పడ్డారు.