తప్పుడు కథనాలు, ఆరోపణలపై నారా లోకేష్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. అసత్య కథనాలు ప్రచురించిన ఓ పత్రిక, కట్టుకథలతో ఆరోపణలు చేసిన అప్పటి స్కిల్ డెవలప్‌మెంట్ చైర్మన్ అజయ్‌రెడ్డిపై లోకేష్ మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసులను దాఖలు చేశారు. వాంగ్మూలం ఇచ్చేందుకు రేపు కోర్టుకు హాజరుకానున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగుతున్న యువగళం యాత్రకు బ్రేక్ ఇచ్చి.. ఇవాళ రాత్రి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. రేపు ఉదయం మంగళగిరి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరుకానున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్‌లో భారీ స్కామ్ అంటూ అప్పటి చైర్మన్ విజయ్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి తనపై అసత్య ఆరోపణలు చేశారని లోకేష్ ఆరోపించారు. తనకు సంబంధం లేని అంశంలో చేసిన ఆరోపణలపై అజయ్‌రెడ్డికి లాయర్ల ద్వారా లీగల్ నోటీసులు పంపారు లోకేష్. అటు వైపు నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో తన పరువు భంగం కలిగించేలా మాట్లాడిన అజయ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు.
స్కిల్ స్కామ్ ఈడీ కొరడా అంటూ ఓ పత్రిక కట్టుకథనం రాసిందని లోకేష్ ఆరోపించారు. వాస్తవంగా జీఎస్టీ అవకతవకలకి పాల్పడిన కంపెనీలకు ఈడీ నోటీసులు ఇస్తే.. దానిని స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ పేరుతో అప్పటి టీడీపీ ప్రభుత్వం, తనకు ఆపాదిస్తూ అసత్యాలు ప్రచురించారని తెలిపారు. నోటీసులు పంపినా ఎలాంటి వివరణ, సమాధానం లేకపోవడంతో లోకేష్ ఆ పత్రికపైనా క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఈ రెండు కేసుల్లోనూ లోకేష్ శుక్రవారం వాంగ్మూలం ఇవ్వనున్నారు.