తిరుపతి ఉప ఎన్నిక.. ఇంటింటి ప్రచారం చేస్తున్న నారా లోకేశ్
ఇవాళ నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో నారా లోకేశ్ పర్యటించనున్నారు.;
తిరుపతిలో టీడీపీ ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్వయంగా ఎన్నికల ప్రచారంలో దిగడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. పైగా నారా లోకేశ్ చేస్తున్న ప్రచారం సూపర్ సక్సెస్ అవుతోంది. కేవలం మాటల ప్రసంగాలకే పరిమితం అవకుండా.. వీధులు, సందుల్లోకి వెళ్లి మరీ జనాలను పలుకరిస్తున్నారు. షాపులు, ఇళ్లల్లోకి వెళ్లి టీడీపీకి ఓటువేయాలని అడుగుతున్నారు.
ఇవాళ నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో నారా లోకేశ్ పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ముత్తూకూరు మండల కేంద్రంలో ప్రచారం చేస్తారు. పలు కాలనీల్లో పర్యటించి ఇంటింటి ప్రచారం చేయనున్నారు.
ఎల్లుండి చంద్రబాబు సైతం రంగంలోకి దిగనున్నారు. తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్‌లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. 8వ తేదీ నుంచి ఎనిమిది రోజుల పాటు రోజుకో నియోజకవర్గం చొప్పున సుడిగాలి పర్యటన చేయనున్నారు చంద్రబాబు. ముందుగా సత్యవేడు నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. అక్కడి నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టి వస్తారు.
తిరుపతి ఉప ఎన్నికకు తక్కువ సమయమే ఉండడంతో టీడీపీ నేతలంతా ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగిస్తున్నారు. ఎక్కడా ఎవరూ విశ్రమించకుండా పనిచేస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలు ప్రచార వ్యూహాలు రచిస్తుంటే.. యువనేతలు వాటిని అమలు చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే క్లస్టర్ల వారీగా తిరుపతి లోక్‌సభ సెగ్మెంట్‌ను పంచుకున్నారు. ఎక్కడి నేతలు అక్కడే విస్తృత ప్రచారం చేస్తున్నారు.