Nara Lokesh: నేటి నుంచి లోకేశ్‌ ‘శంఖారావం’

ఉత్తరాంధ్రలో 31 నియోజకవర్గాల్లో యాత్ర

Update: 2024-02-11 03:37 GMT

తెలుగుదేశం జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. యువగళం పాదయాత్ర సాగని చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించేలా నేడు శంఖారావాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. రోజుకు 3నియోజకవర్గాల చొప్పున11రోజుల పాటు తొలిదశలో 31 నియోజకవర్గాల్లో పర్యటన సాగనుంది. ప్రజా చైతన్య శంఖారావం ద్వారా నవ్యాంధ్రకి నవశకం లిఖించే ఈ సమర నినాదంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని లోకేష్ పిలుపునిచ్చారు.

 సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని కార్యోన్ముఖులను చేయటంతో పాటు జగన్ పీడిత వర్గాలన్నింటికీ భరోసా కల్పించేలా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం యాత్రకు సిద్ధమయ్యారు. ఇచ్ఛాపురంలో ప్రారంభమై... ఇవాళే పలాస, టెక్కలిలోనూ కొనసాగనుంది. ఇచ్ఛాపురం రాజావారి గ్రౌండ్స్‌ ప్రారంభ సభలో లోకేశ్‌ ప్రసంగిస్తారు. ఆపై వార్డు స్థాయి నుంచి నియోజకవర స్థాయి వరకు పార్టీ నేతలు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం పార్టీ శ్రేణులతో ప్రతిజ్ఞ చేయించి.. సూపర్‌-6 కిట్ల అందజేస్తారు. ‘సెల్ఫీ విత్‌ లోకేష్ ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆయా నియోజకవర్గాల్లో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’, ‘మన టీడీపీ యాప్‌’లో ప్రతిభ కనబరిచిన కార్యకర్తల్ని అభినందిస్తారు. తెదేపాలో చేరికల కార్యక్రమంలో పాల్గొంటారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ తరహా కార్యక్రమాల్నే రూపొందించారు. మధ్యాహ్నం పలాస, సాయంత్రం టెక్కలి చేరుకుంటారు. రాత్రికి నరసన్నపేటలోని జమ్ము గ్రామ శివారులో ఆయన బసచేస్తారు.


వార్డు నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నిర్వహించే శంఖారావం కార్యక్రమంలో.... ప్రభుత్వ వైఫల్యాలు, దోపిడీ విధానాలను ప్రజల్లో ఎండగట్టనున్నారు. వివిధ వర్గాలకు భరోసా కల్పిస్తూ చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ కార్యక్రమాలపై ప్రజలను చైతన్య పరచనున్నారు. 58నెలలుగా ఉత్తరాంధ్రలో జగన్ అండ్ కో చేసిన విధ్వంసం, ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారానికి అధికారంలోకి వచ్చాక చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తారు. తప్పుడు కేసులు, వేధింపులకు గురైన కార్యకర్తలకు భరోసా కల్పిస్తారు. జగన్ పాలనలో మోసపోయిన యువత, మహిళలు, ఇతర అన్ని వర్గాలకు ధైర్యం కల్పించేలా శంఖారావం సాగనుంది.

లోకేష్ పాదయాత్ర పల్లెలు, పట్టణాలను ఏకం చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చింది. 226రోజులపాటు 3132 కిలో మీటర్ల మేర.... 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2197 గ్రామాల మీదుగా సాగింది. సుమారు కోటిమందిని లోకేష్ నేరుగా కలుసుకొని వారి కష్టాలు తెలుసుకున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా 79రోజులపాటు పాదయాత్ర నిలిచిపోయింది. ఎన్నికలు ముంచుకొస్తున్నందున విశాఖ పరిధిలోని అగనంపూడి వద్ద డిసెంబర్ 18వతేదీన లోకేష్ యువగళం పాదయాత్రను అనివార్యంగా ముగించారు. విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద నవశకం పేరుతో నిర్వహించిన బహిరంగసభ చరిత్ర సృష్టించింది. పాదయాత్ర సాగని ప్రాంతాల్లో లోకేష్‌ శంఖారావం సాగనుంది.

Tags:    

Similar News