Yuvagalam: 3వేల కిలోమీటర్లు పూర్తైన యువగళం పాదయాత్ర
లోకేశ్ ‘యువగళం’ పైలాన్ ఆవిష్కరణ;
టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చారిత్రాత్మక మైలు రాయిని అధిగమించింది. సోమవారం యువగళం పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. తుని నియోజకవర్గం తేటగుంట పంచాయతీలో ఈ మజిలీకి గుర్తుగా పేదల ఆకలి తీర్చే అన్నాక్యాంటీన్లను కొనసాగిస్తామని హామీ ఇస్తూ శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సతీమణి నారా బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్, మోక్షజ్ఞ, భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తేటగుంట జాతీయ రహదారి జనసంద్రంగా మారింది. తుని నియోజకవర్గం తేటగుంట వద్ద పండుగ వాతావరణం నెలకొంది. లోకేష్‌తో కలిసి కుటుంబసభ్యులు నారా బ్రహ్మణి, దేవాన్ష్, మోక్షజ్ఞ, భరత్ పాదయాత్ర చేస్తున్నారు. చారిత్రాత్మక మైలురాయి చేరుకున్న సందర్భంగా ఆనందంతో యువగళం బృందాలు కేరింతలు కొడుతున్నారు. వేలాది కార్యకర్తలు, అభిమానుల రాకతో జాతీయ రహదారి కోలాహలంగా మారింది.
లోకేశ్‌కి సంఘీభావం తెలిసిన టీడీపీ ముఖ్యనేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో రాజుల కొత్తూరు జనసంద్రాన్ని తరలించింది. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రజలే సైన్యంగా యువగళం పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయికి చేరిందన్నారు.