AP: ప్రతి శనివారం నో బ్యాగ్‌ డే

ఏపీలోని పాఠశాలల్లో అమలు... విద్యామంత్రి లోకేశ్ ఆదేశాలు;

Update: 2025-01-29 02:30 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పాఠశాలలో ప్రతి శనివారం నో బ్యాగ్‌ డేగా పాటించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఆ రోజు బ్యాగ్ లేకుండానే స్కూల్లో యాక్టివిటీస్ రూపొందించాలన్నారు. ఉపాధ్యాయులకు ఇప్పుడున్న అనేక యాప్‌ల స్థానంలో ఒకటే యాప్ రూపొందించాలని సూచించారు. పాఠశాల విద్యలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117 ఉపసంహరణపై అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించాలని అధికారులను ఆదేశించారు.

వైసీపీ వల్లే ఈ దురావస్థ

అయిదేళ్ల వైసీపీ అస్తవ్యస్త పాలన వల్ల ఏపీ దివాళా తీసిందని ఏపీ విద్యామంత్రి నారా లోకేశ్ విమర్శించారు. పారిశ్రామికవేత్తలను వేధిస్తే పెట్టుబడులు ఎలా పెడతారని ప్రశ్నించారు. సుస్థిర పాలన వల్లే మహారాష్ట్రకు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. పారిశ్రామిక వేత్తలను ఆంధ్రప్రదేశ్‌కు రప్పించేందుకు చాలా శ్రమించాల్సి వస్తోందని నారా లోకేశ్ మండిపడ్డారు. జగన్ వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు.

ఆ వ్యాఖ్యలు చెయ్యొద్దు..

నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని టీడీపీ శ్రేణులు చేస్తున్న డిమాండ్‌.. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది కూడా కాకముందే అనూహ్యంగా ఈ డిమాండ్‌ తెర మీదకు రావడంతో ఇటు టీడీపీ అధిష్టానంతో పాటు అటు జనసేన అధిష్టానం కూడా స్పందించింది. ఎవరికి వారు తమ తమ అభిప్రాయాల్ని మీడియా ఎదుట, సోషల్ మీడియాలో చెప్పడానికి వీళ్లేదని హెచ్చరించింది. ఏ నిర్ణయమైనా కూటమి పెద్దలు మాట్లాడుకున్న తర్వాతే తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ అంశంపై టీడీపీ సీనియర్ లీడర్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని అడగటం కరెక్ట్ కాదని పార్టీ శ్రేణులకు చురకలు అంటించారు.

అల్రెడీ పవన్ ఉన్నాడు..

ఆంధ్రప్రదేశ్‌కు ఉప ముఖ్యమంత్రిగా జనసేన నేత పవన్ కల్యాణ్ ఉన్నారని గోరంట్ల బుచ్చయ్యచౌదరీ గుర్తు చేశారు. పార్టీ కోసం లోకేష్ ఎంతో కష్టపడి పనిచేశారని.. అందులో ఎవరికీ ఎటువంటి అనుమానం లేదన్నారు. అందుకు తగ్గట్టుగా పార్టీ కూడా లోకేష్‌కు సముచిత స్థానాన్నే కల్పించిందని గుర్తుచేశారు. ఈ అంశంపై పదే పదే మాట్లాడితే లోకేష్‌ను తగ్గించిన వాళ్లం అవుతామని.. దయచేసి ఎవరూ మరోసారి ఈ డిమాండ్‌ చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. విజయసాయిరెడ్డి రాజీనామా అంశం మీదా బుచ్చయ్య చౌదరి స్పందించారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన వారికి ఎవడైనా సరే శిక్షలు తప్పవని, అక్రమాలకు పాల్పడి.. అధికారం పోయిన తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన పార్టీలో చేరడం సరైంది కాదన్నారు.

Tags:    

Similar News