BABU REMAND: రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌కి చంద్రబాబు

ఆంక్షల మధ్య తరలించిన పోలీసులు..లోకేశ్‌ భావోద్వేగం..;

Update: 2023-09-11 01:15 GMT

స్కిల్ డెవలప్‌మెండ్‌ కేసులో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. కఠిన ఆంక్షల మధ్య ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌కు తరలించారు. జైలు పరిసర ప్రాంతంలో పికెటింగు ఏర్పాటు చేసిన పోలీసులు ఎవ్వరినీ అక్కడకు అనుమతించలేదు. విజయవాడలో రాత్రి తొమ్మిదిన్నరకు బయలుదేరిన కాన్వాయ్ రెండున్నర గంటల్లో రాజమహేంద్రవరం చేరుతుందని అంతా భావించారు. కానీ పోలీస్ ఆంక్షలు మధ్య వాహనశ్రేణి నాలుగున్నర గంటలు ఆలస్యంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకుంది . చంద్రబాబు కాన్వాయ్ ప్రయాణించే దారి పొడవునా సాధారణ ప్రయాణికులు వాహనాలను ఆపేయడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు . జైలు వద్ద చంద్రబాబు వాహనాన్ని మాత్రమే ప్రాంగణంలోకి అనుమతించారు .


చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్, మాజీ మంత్రి జవహర్ తూర్పు గోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్, చంద్రబాబు కాన్వాయ్ తో పాటు వచ్చారు. వారందరినీ పోలీసులు బయట నిలిపి వేశారు . లోకేష్ కొంతసేపు నిరీక్షణ అనంతరం పోలీసులు ఆయన్ను లోపలకి అనుమతించారు. చంద్రబాబు కారాగారం లోకి వెళ్లే సమయంలో లోకేశ్‌ను ప్రధాన ద్వారం వరకు అనుమతించారు. ఈ సమయంలో తండ్రిని చూసి లోకేష్ ఉద్వేగానికి లోనయ్యారు. లోకేశ్‌ను ఓదార్చిన చంద్రబాబు, ధైర్యంగా ఉండాలని ఈ అక్రమ కేసులు తననేమీ చేయలేవని ధైర్యం చెప్పారు. అమ్మ జాగ్రత్త అని లోకేశ్‌కు చెప్పి కారాగారంలోకి వెళ్లారు. పోలీసులు చంద్రబాబు పట్ల వ్యవహరించిన తీరుపై ఆపార్టీ నేతలు మండిపడ్డారు.


చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో పోలీస్ చట్టం -30ని తూర్పు గోదావరి జిల్లాలో అమలులోకి తెచ్చారు. జిల్లా నేతలను గృహ నిర్బంధం చేశారు. జైలు వద్ద పోలీసులు పూర్తి ఆంక్షలు విధించారు. కారాగారం పరిసర ప్రాంతాలు పికెటింగులు, ఏర్పాటు చేశారు . 300 మంది పోలీసులను మోహరించారు .

అంతకుముందు చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ 14 రోజుల రిమాండు విధించింది. ఆదివారం ఉదయం 8 గంటల 15 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల వరకు సుదీర్ఘంగా జరిగిన వాదనల అనంతరం చంద్రబాబుకు ఈ నెల 22 వరకు రిమాండు విధిస్తూ అనిశా కోర్టు న్యాయాధికారి హిమబిందు ఉత్తర్వులు జారీచేశారు. సాయంత్రం 6 గంటల45 నిమిషాలకు న్యాయాధికారి ఉత్తర్వులు వెలువడ్డాయి. తీర్పు వెలువడే వరకూ తీవ్ర ఉత్కంఠభరిత వాతావరణం కొనసాగింది.

Tags:    

Similar News