ఏలూరు ప్రజలకు ఏమైంది.. ఎందుకలా ఉన్నట్టుండి..
మరో 315 మంది పైగా మహిళలు, చిన్నారులు ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రి (జిజిహెచ్)లో జాయిన్ అయ్యారు.;
ఏలూరు ప్రజలకు ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు.. ఎందుకలా ఉన్నట్టుండి కళ్లు బైర్లు కమ్మినట్టై కిందపడిపోతున్నారో తెలియట్లేదు. వైద్యులకు అంతు చిక్కని వ్యాధి ఏదో ఏలూరు ప్రజలను కబళిస్తోంది.. ఇప్పటికే కొన్ని తీవ్రలక్షణాలతో ఒకరు మరణించారు. మరో 315 మంది పైగా మహిళలు, చిన్నారులు ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రి (జిజిహెచ్)లో జాయిన్ అయ్యారు. రోగుల సంఖ్య శనివారం అర్థరాత్రి 55 మంది నుంచి ఆదివారం ఉదయానికి 170కి చేరుకుంది. ఇక ఆదివారం సాయింత్రం నుంచి అర్థరాత్రికి వీరి సంఖ్య 315 కు పెరిగింది. వివిధ ప్రైవేటు ఆసుపత్రులలో మరో 50 మంది చికిత్స పొందుతున్నారని నివేదికలు తెలిపాయి.
రోగులు మైకము, తలనొప్పి, మూర్ఛ వంటి లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నట్లు వైద్యులు వివరిస్తున్నారు. నివేదించిన కేసుల్లో ఎక్కువ భాగం కొబ్బరి తోట, కోత్తపేట, తూర్పు వీధి, అరుంధతీపేట నుండి వచ్చినట్లు రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు. బాధితుల్లో ఎక్కువమంది 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యవారు కాగా.. 12 ఏళ్లలోపు పిల్లలు 45 మందికి పైగా ఉన్నారు. అప్పటివరకు బాగానే ఉన్నా.. ఉన్నట్టుండి కింద పడిపోయామని వ్యాధి నుంచి కోలుకున్న వారు వివరిస్తున్నారు.
దిల్లీలోని ఎయిమ్స్ బృందం ఇప్పటికే నమూనాలను సేకరించి మరింత లోతుగా అధ్యయనాలు జరుపుతోంది. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి కూడా ఏపీ అధికారులు కొన్ని నమూనాలను పంపించారు. నమూనాల ఫలితాలు వచ్చిన తరువాతే వ్యాధికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఆర్గానో క్లోరినో అనే రసాయనం కారణమై ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.