Cylinder Explosion: ఆక్సిజన్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి, పలువురికి గాయాలు!

రాజస్థాన్ రాజధాని జైపూర్‌ లో ఘటన

Update: 2026-02-01 03:10 GMT

 రాజస్థాన్ రాజధాని జైపూర్‌ లోని విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియాలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఫ్యాక్టరీలో ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో భారీ విస్ఫోటనం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పేలుడు శబ్దం కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ వినిపించడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

పోలీసుల వివరాల ప్రకారం.. కరణీ విహార్ కాలనీ రోడ్ నంబర్–17లో ఉన్న సూపర్ గ్యాస్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంతేకాకుండా పలువురు కార్మికులు గాయపడినట్లు సమాచారం. విస్ఫోటనం తర్వాత ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగి చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న వెంటనే విశ్వకర్మ పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక దళాలు, సివిల్ డిఫెన్స్ బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. స్థానికుల సహాయంతో ఫ్యాక్టరీలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చారు.

అగ్నిమాపక శాఖ సంబంధించిన పలు వాహనాలు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. గాయపడిన వారిని అంబులెన్సుల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఘటన ప్రాంతాన్ని పూర్తిగా కార్డన్ చేసి, స్థానికులను అప్రమత్తం చేశారు. ఈ పేలుడుకు గల కారణాలపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) బృందాలు దర్యాప్తు చేపట్టాయి. ఘటన తీవ్రతను పరిగణలోకి తీసుకుని పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు, జిల్లా అధికారులు తెలిపారు.

Tags:    

Similar News