PAWAN: మంచి చేయకపోతే రాజకీయాలు వదిలేస్తా
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ హామీ.. మత్స్యకారుల బహిరంగలో సభలో పవన్... ఉప్పాడ-కొణాపాక పనులు ఆరంభం
ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తానని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మాట ఇచ్చారు. ఇప్పటికే ఉప్పాడ- కొణపాక మధ్య తీర రక్షణ పనులు ప్రారంభించినట్లు చెప్పారు. పవన్ కల్యాణ్ ఉప్పాడ ప్రాంతానికి చెందిన మత్స్యకార ప్రతినిధులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడిన పవన్ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఉప్పాడలో నిర్వహించిన మత్స్యకారుల బహిరంగ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై చర్చించామని పవన్ కల్యాణ్ తెలిపారు. చేపల వేటపై 7 వేలకు పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఏటా రూ.20 వేలు ఇస్తున్నామని డిప్యూటీ సీఎం అన్నారు. పరిశ్రమల వ్యర్థాల వల్ల మత్స్య సంపద తగ్గిపోతోందనే ఆందోళన ఉందన్నారు. ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణంపై ఈనెల 14న సమావేశం నిర్వహిస్తామని, అలానే ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తామని మత్స్యకారులకు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. రూ.323 కోట్లతో ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మించేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తెలిపారు.
పవన్ కీలక వ్యాఖ్యలు
‘‘పరిశ్రమలకు వ్యతిరేకం కాదని మత్స్యకారులు చెబుతున్నారు. పరిశ్రమల వ్యర్థాల వల్ల మత్స్యసంపద తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారు. వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదలడం వల్ల మత్స్యసంపద దెబ్బతింటుంది. పరిశ్రమల వ్యర్థాల వ్యవహారంలో మత్స్యకారులు ఎక్కడికి చెబితే అక్కడికి వస్తా. వ్యర్థాలు ఎక్కడ కలుస్తున్నాయో.. అక్కడికే బోటులో వెళ్తా. 100 రోజులు సమయం ఇస్తే.. కాలుష్యం తగ్గింపుపై ప్రణాళిక రూపొందిస్తాం. ప్రజలను వంచించాలని నాకు లేదు. ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతా. ' రూ.323 కోట్లతో సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి కేంద్రం సానుకూలం ఉంది. ఉప్పాడ-కొణపాక మధ్య తీరరక్షణ పనులు ప్రారంభించాం. పరిశ్రమల వ్యర్థాల శుద్ధిపై మూడు విడతల్లో పరిశీలిస్తాం. మత్స్యకారులు ఎక్కడికి చెబితే అక్కడికి మూడ్రోజుల్లో వస్తాను. వ్యర్థాలు ఎక్కడ కలుస్తున్నాయో.. అక్కడికే బోటులో వెళ్తాను. ప్రజలను వంచించాలని ఎప్పుడూ ఉండదు.’’ అని పవన్ అన్నారు.