PAWAN: జనసేన ఎమ్మెల్యేలు జాగ్రత్త: పవన్
రుషికొండ భవనాలను పరిశీలించిన జనసేనాని
కూటమి ప్రభుత్వంపై మాట్లాడేటప్పుడు జనసేన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. కూటమి ఇప్పుడు రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా అత్యవసరమని అన్నారు. క్షేత్రస్థాయిలో కూటమిగా కలిసి నడుస్తున్నప్పుడు సమస్యలు వస్తాయని.. వాటిని సమయానుసారం అధిగమిద్దామని పవన్ అన్నారు. కూటమి ఐక్యత పెరిగేలా.. జనసేన నేతలు అందర్నీ కలుపుకుని పోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.
రుషికొండ ప్యాలెస్ పరిశీలన
విశాఖలో "సేనతో సేనాని" కార్యక్రమాల్లో పాల్గొంటున్న డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రుషికొండ ప్యాలెస్‌ను పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యేలతో కలిసి పవన్ రుషికొండలోని భవనాలను పరిశీలిస్తున్నారు. భారీ భవనాలు చూసి.. ఖర్చు గురించి తెలుసుకుని పవన్ ఆశ్చర్యపోయారు. ఏడాదికి 7 కోట్ల ఆదాయం వచ్చే రుషికొండపై.. 1 కోటి రూపాయలు కేవలం కరెంటుకే వెచ్చించే స్థితికి తెచ్చారని అధికారులు పవన్‌కు తెలిపారు.
నేడు కీలక చర్చలు
'సేనతో సేనాని’ సభకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా నామకరణం చేశారు. ఐదు ప్రధాన ద్వారాలకు ఉత్తరాంధ్ర మహనీయుల పేర్లు పెట్టారు. జనసేన పార్టీ ఎల్లప్పుడు జాతీయ నాయకులను, మహనీయులను స్మరించుకుంటుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. జనసేన పార్టీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చిస్తారు. నేడు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10 మంది పార్టీ సభ్యులను ఎంపిక చేస్తారు. వారితో పవన్ కళ్యాణ్ వివిధ అంశాలపై మాట్లాడతారు. ఆ రోజు రాత్రి ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 30వ తేదీన ఇందిరా గాంధీ ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు అధికంగా ప్రభుత్వ పనుల్లో నిమగ్నమైన పవన్ , తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలతో నేరుగా మాట్లాడటం ప్రత్యేకతగా మారింది. గత సంవత్సరం నుండి కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు నేరుగా చెప్పే అవకాశం లభించడం వల్ల ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది.