PAWAN: 11 కోట్ల మంది భక్తులకు కల్తీ లడ్డూలు పంపిణీ

శాసనసభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన

Update: 2026-02-24 11:45 GMT

భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతపై వచ్చిన ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటం అత్యంత తీవ్రమైన నేరమని, ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో దోషులు ఎవరో తేల్చి, కూటమి ప్రభుత్వం కచ్చితంగా శిక్షిస్తుందని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్రణాళికాబద్ధమైన కుట్ర జరిగిందని ఆరోపించారు. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (NDDB) నివేదికలో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు వెల్లడైందని చెప్పారు. ఇక సీబీఐ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో అసలు నెయ్యే లేకుండా పామాయిల్, ఇతర రసాయనాలతో తయారు చేసిన పదార్థాన్ని ఉపయోగించినట్లు ఆధారాలు లభించాయని వివరించారు. పాల నుంచి కాకుండా రసాయనాల ద్వారా నెయ్యి తయారు చేయడం అరాచకానికి కొత్త రూపమని విమర్శించారు.

గత ప్రభుత్వ హయాంలోనే ఈ అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా  వైసీపీ పాలనలో లడ్డూ నాణ్యతపై అనేక ఆరోపణలు వచ్చాయని గుర్తుచేశారు. లడ్డూ కల్తీ వ్యవహారంపై ముఖ్యమంత్రి సభలో మాట్లాడిన వెంటనే ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై తాము ఆలోచించామని చెప్పారు. తిరుమలలో జరిగిన ఈ తప్పిదంపై నిరసనగా తాను దీక్ష చేపట్టిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. నెయ్యి తయారీ కోసం అవసరమైన పాలను వేరుచేయని సంస్థలకు టెండర్లు అప్పగించారని, నిబంధనలు మార్చి కొంతమంది నచ్చిన సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. నిందితులపై గత పాలకులు చర్యలు తీసుకోలేదని, జరిగిన తప్పుకు అప్పటి టీటీడీ పాలక మండలే బాధ్యత వహించాలని అన్నారు. అలాంటి వారిని వెనకేసుకొస్తున్న గత ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు కూడా బాధ్యత వహించాల్సిందేనని వ్యాఖ్యానించారు.

హిందూ ధర్మం మీద దాడి జరిగినప్పుడు భాష, కులం, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఖండించాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. లేదంటే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయని హెచ్చరించారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, ఈ కేసులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి ప్రసాద పవిత్రతను పునరుద్ధరించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News