ఏపీని పాలించడానికి జగన్ అనర్హుడని పవన్ మండిపడ్డారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి, అతని అనుచరులు మానవ వనరులను దోపిడీ చేస్తున్నారని చెప్పారు. దానిపై అందరం కలిసి పోరాడాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. జగన్ దుర్మార్గపు పాలనను తరిమి కొట్టాలన్నారు.
జనసేనను అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2019లో అవలంభించిన విధానం కాకుండా సరికొత్త విధానంలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. స్థానిక అంశాలు, అభిప్రాయాలు, సర్వే నివేదికల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. అన్ని వ్యవస్థల్లో దోపిడీ జరుగుతున్న మాట వాస్తవమన్నారు. ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా ప్రైవేట్ సంస్థల చేతికి వెళ్లిందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు.
విశాఖ వారాహి యాత్రతో మరింత బలంగా జనసేన దూసుకెళ్తుందని పవన్ చెప్పారు. వైసీపీ నేతల దోపిడీ, దౌర్జన్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే పోలీసులే మౌనంగా ఉన్నారని తెలిపారు. అక్కడ ఏం జరిగిందో తర్వాత అందరూ చూశారన్నారు. ఉభయ గోదావరి జిల్లాల తరహాలో విశాఖలో వారాహి యాత్రకు మంచి స్పందన వస్తుందని తెలిపారు. విశాఖ జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చేద్దామన్నారు. మంచి నాయకులు పార్టీలోకి వస్తామంటే ఆహ్వానిద్దామని పవన్ తెలిపారు. డిబేట్స్‌లో అంశాల వారీగా గట్టిగా సమాధానం చెప్పాలన్నారు. జనసేనకు భాష ముఖ్యమన్నారు. కేవలం విధానాలపైనే ప్రశ్నించాలన్నారు.
భవిష్యత్తులో జనసేన ప్రభుత్వాన్ని తప్పకుండా ఏర్పాటుచేస్తామని పవన్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులపై పోలీసులు దాడి చేస్తే తాను స్పందిచానన్నారు. అదే జనసైనికులపై దాడులు చేస్తే బీజేపీ నేతలు కనీసం స్పందించరా అని ఆయన ప్రశ్నించారు. దిష్టిబొమ్మను ఊరేగిస్తే క్రిమినల్ కేసులు పెడ్తారా అని పవన్ మండిపడ్డారు. బాధితులకు అండగా నిలవాలన్నారు. పార్టీని నడపడానికి సినిమాలు తీస్తున్నానని... రాజకీయాల్లోకి సినిమాను లాగొద్దాన్నారు.