PAWAN: జనసేన జయకేతనం ఎగరేయాలి: పవన్
జనసేన శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపు... సీఎం పదవిపై సుముఖంగానే ఉన్నట్లు ప్రకటన...;
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడేలా.. జనసేన, టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టేలా ముందుకు సాగుదామని పార్టీ శ్రేణులకు జనసేనాని పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన జయకేతనం ఎగురవేయాలన్నారు. ఆ దిశగానే టీడీపీతో కలిసి వెళ్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి కంటే ప్రజల భవిష్యత్తే ముఖ్యమని పవన్ తేల్చి చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్న పవన్... జనసేన కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. సీఎం స్థానం పట్ల తాను ఏరోజూ విముఖత చూపలేదని సుముఖతతోనే ఉంటానని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఇవాళ మనకు ముఖ్యమంత్రి పదవి కంటే ప్రజల భవిష్యత్తు ముఖ్యమని పవన్ స్పష్టం చేశారు. ప్రజల భవిష్యత్తు బాగుండాలన్నదే జనసేన ఆకాంక్షని తేల్చి చెప్పారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పనిచేయాలని సూచించారు. ప్రతికూల సమయంలోనే నాయకుడి ప్రతిభ తెలుస్తుందన్న జనసేనాని... టీడీపీ జనసేన ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు బలమైన దిశానిర్దేశం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్న పవన్. ఒకరి అండదండలు లేకుండా జనాదరణతో ఇంతదూరం వచ్చామన్నారు.ప్రస్తుతం పార్టీలో 6.5లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారని.... పార్టీ పరంగా ఏ నిర్ణయమైనా నేను ఒక్కడినే తీసుకునేది కాదన్నారు. జనసేన పార్టీకి కళ్లు, చెవులు క్రియాశీల సభ్యులే అని.. క్రియాశీల సభ్యుల అభిప్రాయాలు నివేదిక రూపంలో తీసుకుంటున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో చిన్న చిన్న ఇబ్బందులున్నా సరిచేసుకుని ముందుకెళ్లాలన్నారు. ఒకరి అండదండలతో కాకుండా సొంతంగా బలోపేతం అయినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు టీడీపీతో కలిసి ఎన్నికలు వెళ్తున్నట్లు తెలిపారు. ఖచ్చితంగా టీడీపీ-జనసేన పార్టీ పొత్తులో భాగంగా ముందుకు వెళ్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.
మూడో తరగతి విద్యార్థులకు టోఫెల్ పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని జనసేన్ అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. విద్యార్థులకు అన్యాయం చేస్తుంటే కచ్చితంగా గొంతెత్తుతాం అని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థను దుర్వినియోగం చేశారన్న పవన్.. విదేశీ కంపెనీలతో ఒప్పందం తర్వాత ఉల్లంఘన జరిగితే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో టోఫెల్ శిక్షణ, ఐబీ సిలబస్ ప్రవేశపెట్టడం వెనుక పెద్దకుంభకోణం దాగి ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. కాలేజి స్థాయిలో వారికి ఇవ్వాల్సిన టోఫెల్ శిక్షణ 3వ తరగతి వారికి ఎందుకని ఆయన ప్రశ్నించారు. కేవలం ఇంగ్లిష్ మాట్లాడటం కోసమే అయితే దానికి టోఫెల్ శిక్షణ అవసరం లేదని స్పష్టం చేశారు. బ్రిటిష్ యాసలో ఇంగ్లిష్ మాట్లాడటం గొప్ప కాదన్నారు. ఇంగ్లిష్ భాష నేర్చుకుంటే అద్భుతాలు జరిగితే అమెరికాలో పేదలే ఉండకూడదని, బ్రిటన్, న్యూయార్క్ వంటి దేశాల్లో ఎవరూ రోడ్ల వెంట తిరిగే వారు కాదని వ్యాఖ్యానించారు. దేశం మొత్తంలో 250స్కూళ్లలో మాత్రమే ఉన్న ఐబీ సిలబస్‌ని మనం 44వేల ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయటం ఎలా సాధ్యమో చెప్పాలన్నారు. ఐబీ సిలబస్ ప్రవేశపెట్టడం వెనుక అవినీతి వ్యవహారాలున్నాయని... 2024లో వైసీపీ ప్రభుత్వం దిగిపోయాక దానిపై విచారణ చేపడతామని హెచ్ఛరించారు.