pawan: ధర్మయుద్ధంలో రైతులు గెలిచారు: పవన్

రైతుల పోరాటం మరువలేనిదన్న పవన్ కల్యాణ్;

Update: 2025-05-03 04:00 GMT

అమరావతి రైతులు రాజధాని కోసం ఐదేళ్లు పోరాటం చేశారని.. వారి పోరాటం మరువలేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని హామీ ఇచ్చామని.. దానిని నెరవేరుస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసిందని వెల్లడించారు. రైతుల త్యాగాలను మర్చిపోలేమన్న పవన్.. బాధ్యతగా అమరావతిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అమరావతి రైతులు ధర్మయుద్ధంలో గెలిచారని పవన్ అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రధాని మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులకు వచ్చారని వెల్లడించారు. అమరావతి ప్రపంచస్థాయి రాజధానిగా రూపాంతరం చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండడంతో అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు.5 కోట్ల మంది ప్రజల తరఫున రైతులు, మహిళలు, విద్యార్థులు తిన్న గాయాలు మదిలో ఉన్నాయన్నారు. ప్రజల త్యాగాలను మర్చిపోమన్న పవన్.. మీ ఆశలకు అనుగుణంగా అమరావతి నిర్మాణం ఉంటుందన్నారు.

పవన్ కు చాక్లెట్ ఇచ్చిన మోదీ

అమరావతి నిర్మాణ పునః ప్రారంభ పనుల వేళ ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఈ భారీ బహిరంగ సభలో ప్రసంగించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరిగి తన స్థానం వద్దకు వెళ్లారు. కుర్చీ దగ్గరకు వెళ్లిన పవన్ ను మోదీ ప్రత్యేకంగా పిలిచి చాక్లెట్ బహుమతిగా ఇచ్చారు. పవన్ కు మోదీ చాక్లెట్ ఇస్తున్న సమయంలో మోదీ-పవన్- చంద్రబాబు చిరునవ్వులు చిందించారు. ఈ ఆసక్తికర సన్నివేశంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పహెల్గామ్ పై స్పందన

పహల్గామ్ ఉగ్రదాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోవడం యావత్ భారతదేశాన్ని కలచివేసిందన్నారు పవన్. ఇంత ఇబ్బందుల్లో కూడా ప్రధాని ఇక్కడికి రావడం ఏపీ ప్రజల అదృష్టం అన్నారు. అమరావతి రైతుల త్యాగాలను ప్రధాని గుర్తించారన్నారు.

Tags:    

Similar News