డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలకు రానున్నారు. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉపముఖ్యమంత్రి.. దీక్ష విరమణకు తిరుమలకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు తిరుమల్లోనే ఉంటారని సమాచారం. సాయంత్రం అలిపిరి పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. రాత్రి నడక మార్గం గుండా తిరుమలకు పవన్ చేరుకోనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
దర్శనాంతరం లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకుని భక్తులకు అందించే అన్న ప్రసాదాలను పరిశీలిస్తారు. క్యూలైన్లను పరిశీలించనున్నారు. అనంతరం టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు.రేపు రాత్రి కూడా కొండపైనే బస చేస్తారు. ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష ఎల్లుండి అంటే గురువారానికి పూర్తవుతుంది. దీక్ష విరమణ అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు కొండ కిందకు చేరుకుంటారు. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పాల్గొంటారు. అనంతరం విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు.
ఏడు కొండలవాడు కొలువైన క్షేత్రం తిరుమలలో ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో అపవిత్ర పదార్థాలు వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 22 నుంచి 11 రోజులపాటు ఆయన ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టారు. దీక్ష విరమణ కోసం తిరుమల కొండకు వెళ్లనున్న పవన్.. స్వామివారిని దర్శించుకుని దీక్షను విరమించనున్నారు.