హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో నిర్వహించిన రాజ్య భాష విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో అమ్మ భాష తెలుగైతే పెద్దమ్మ భాష హిందీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటూ ఉంది, కానీ మన దేశం మొత్తం ఈ రోజు ఏకం కావడానికి ఒక రాజ్య భాషని వెతుక్కుంది. అదే హిందీ’ అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం భాషతో సంబంధం లేకుండా ముందుకెళ్తున్న ప్రస్తుత రోజుల్లో హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని పవన్ అన్నారు. అలా చేయడం రాబోయే తరాల అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుందన్నారు. హిందీలో డబ్ అయిన 31 శాతం సౌత్ ఇండియన్ సినిమాలు ఆదాయం తెచ్చిపెడుతున్నాయి. వ్యాపారానికి హిందీ కావాలి కానీ, నేర్చుకోవడానికి ఎందుకు ఇబ్బంది. హిందీ నేర్చుకోవడమంటే మన ఉనికిని కోల్పోవడం కాదు. ఇంకో భాషను అంగీకరించడమంటే ఓడిపోవడం కాదు.. కలిసి ప్రయాణించడం’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం వలనే కదా ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. అలాంటిది దేశం మొత్తం మీద ఎక్కువ శాతం జనాభా మాట్లాడే హిందీ భాష నేర్చుకోవడం వల్ల ప్రయోజనమే కానీ నష్టం వచ్చే పరిస్థితి ఏం లేదన్నారు. భారతీయ భాషలను మాతృభాషలుగా గౌరవించాలన్నారు దక్షిణ సంవాదం కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి పాల్గొన్నారు.