AP: అవ్వతాతల కళ్లల్లో ఆనందం
ఇంటింటికి వెళ్లి అందిస్తున్న ప్రజా ప్రతినిధులు, హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు;
ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఇవాళ తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు నగదును అందజేస్తున్నారు. వృద్ధులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు పంపిణీ చేశారు. నెల్లూరు 48వ డివిజన్ పొర్లుకట్ట ప్రాంతంలో ఏపీ పురపాలకశాఖ మంత్రి నారాయణ పింఛన్లు అందజేశారు. అవ్వాతాతల కళ్లల్లో ఆనందం చూస్తున్నట్లు ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారమే ఇంటి వద్దకే వెళ్లి ఇస్తున్నట్లు చెప్పారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఏకైక నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి వృద్ధులకు పింఛన్లు అందజేశారు.
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటోందని చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తామన్నారు. త్వరలోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ అనురాధ ప్రారంభించారు. పింఛన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం పింఛన్ల పంపిణీ కోసం 2,737 కోట్ల ను ప్రభుత్వం ముందుగానే విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న 64.82 లక్షల మందికి ఈరోజు ఉదయం నుంచి పింఛన్లను పంపిణీ చేయడం ప్రారంభించారు. పింఛన్ల పంపిణీని రేపటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే మరొక రోజు తీసుకోవాలని, అంతే తప్ప పింఛన్ల పంపిణీలో ఎలాంటి జాప్యం చేయవద్దని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రభుత్వం వృద్ధులకు ఎన్టీఆర్ ఆసరా పింఛను కింద నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సత్యసాయి జిల్లాలోని మడకశిర మండలంలోని గుండుమలలో ఈరోజు మధ్యాహ్నం లబ్దిదారుల ఇంటికి వెళ్లి పింఛనును అందచేయనున్నారు. నేడ శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి అక్కడ పూజలు కూడా నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మడకశిర వెళ్లనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
విశాఖ జిల్లాలో ఎన్‌టీఆర్ సామాజిక భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. జిల్లాలో 1,63, 210 మందికి..70.05 కోట్లు పంపిణీ చేశారు. పెన్షన్ల పంపిణీ కోసం 4,398 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఈ రోజు, రేపటి కల్లా పింఛన్లు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందు వలన పెన్షన్ల పంపిణీకి ప్రజాప్రతినిధులు దూరమయ్యారు. ఉమ్మడికడప జిల్లా వ్యాప్తంగా వేకువ జాము నుంచి పింఛన్లను సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో అధికారులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా రూ.329.44 కోట్లు పంపిణి చేయనున్నారు.