MODI: మే 2న అమరావతికి ప్రధాని మోదీ
రాజధాని పునర్నిర్మాణ పనులకు మోదీ శంకుస్థాపన;
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. మే 2వ తేదీన రాజధాని అమరావతికి విచ్చేయనున్న ప్రధాని మోదీ... రాజధాని పునర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటన ఖరారైందని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... మూడేళ్లలో అసెంబ్లీ, హైకోర్ట్, సచివాలయం, అమరావతి పనులు మొత్తం పూర్తయి తీరాల్సిందేనని తేల్చి చెప్పారు. అందుకు సంబంధించిన పనులకు టెండర్లు పిలిచామని ఆయన చెప్పారు. ఇన్ఛార్జ్ మంత్రుల పర్యటనల్లో 3 పార్టీల నేతల భాగస్వామ్యం ఉండాలని చంద్రబాబు సూచించారు. రెవెన్యూ సంబంధిత అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. రెవెన్యూ సమస్యల్లో పోలీసుల జోక్యం అంశాలను పరిష్కరించాలని తేల్చి చెప్పారు. సూర్యఘర్ పథకం అమలు మరింత వేగం పెంచాలని దిశానిర్దేశం చేశారు.
భారీ ఏర్పాట్లు
అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు ప్రధాని మోదీ రానున్న వేళ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. లక్ష నుంచి నాలుగు లక్షల మంది వరకు జన సమీకరణ చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకు తగ్గట్టుగా టెంట్లు, గ్యాలరీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. నాలుగు లక్షల మందికి కూర్చోవటానికి వీలుగా మూడు భారీ వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. సభ సాయంత్రం పూట జరిగితే ఓపెన్‌గా గ్యాలరీలు మాత్రమే ఉంచాలని చూస్తున్నారు. ముందు వరుసలో రాజధాని రైతులకు ప్రత్యేక గ్యాలరీ సిద్ధం చేస్తారు. అధికారులు, ఎంవీఐపీలు, వీవీఐపీలు, ప్రముఖులు, ప్రత్యేక ఆహ్వానితులకు వేర్వేరుగా గ్యాలరీలు ఉంటాయి. వీరందరితో పాటు వీఐపీలకు కూడా ప్రత్యేకంగా పాసులు జారీ చేయనున్నారు. ప్రధాన వేదికను భారీ ఎల్‌ఈడీలతో తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. సాంస్కృతిక వేదికను కూడా ఏర్పాటు చేయనున్నారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా కూచిపూడి, ఇతర సంప్రదాయ నృత్యాలను ఈ వేదికపై ప్రదర్శించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అమరావతి చరిత్ర గురించి ప్రధాని నరేంద్రమోదీకి చాటిచెప్పేలా ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు.