పోలవరం ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. సీఎం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ మొత్తం పొడవు 1,396 మీటర్లు కాగా, అందులో 500 మీటర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని.. ఈ పనులను మరింత వేగవంతం చేయడానికి 3 ట్రెంచ్ కట్టర్లు, 3 గ్రాబర్లను ఉపయోగిస్తున్నామని చెప్పారు. వర్షాకాలంలో వరదలు వచ్చినప్పటికీ, పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
అలాగే ఎగువ కాఫర్ డ్యామ్‌ను మరింత బలోపేతం చేసేందుకు చేపట్టిన బట్రస్ డ్యామ్ నిర్మాణ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయని మంత్రి నిమ్మల తెలిపారు. 2027 డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించయారు.