chalo vijayawada : చలో విజయవాడ : ఎక్కడికక్కడ ఉద్యోగుల గృహనిర్బంధాలు, అరెస్టులు

chalo vijayawada : చలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

Update: 2022-02-03 01:56 GMT

chalo vijayawada : చలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగులు చేయబోయేది బలప్రదర్శనే అని భావిస్తున్న ప్రభుత్వం.. ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ సత్తా ఏంటో చూపించాల్సిందేనన్న కసితో ఉన్నారు. ఇప్పటికే పోలీసుల కళ్లు గప్పి విజయవాడ చేరుకున్నారు పలువురు ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగులమని గుర్తుపట్టకుండా ఉండేందుకు లుంగీలతో, చేతిలో సంచితో, మారువేషాలు ధరించి విజయవాడ చేరుకున్నారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ఫోన్లు స్విచాఫ్ చేసుకుని అండర్‌గ్రౌండ్‌లో ఉన్నారు. అనుకున్న సమయానికి బయటకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

విజయవాడ నగరం మొత్తాన్ని దిగ్బంధించారు పోలీసులు. ఇక ఉద్యోగులు చేరుకోవాల్సిన బీఆర్‌టీఎస్‌ రోడ్డులో అయితే ఏకంగా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. విజయవాడకు రైళ్లలో వస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను రైల్వే స్టేషన్లలోనే అదుపులోకి తీసుకుంటున్నారు. విజయవాడకు బయల్దేరిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులను నరసాపురం రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు. ఇప్పటికే రైళ్లలో బయల్దేరిన ప్రభుత్వ ఉద్యోగులు.. పోలీసులకు చిక్కకుండా కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. రైలు స్టేషన్‌కు చేరుకోకముందే చైన్లు లాగి, ట్రైన్లు ఆపి, విజయవాడ చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

అటు విజయవాడకు వచ్చే అన్ని ప్రధాన రోడ్లపైనా పోలీసులు కాపు కాశారు. జిల్లాల నుంచి విజయవాడ వచ్చే అన్ని దారులలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. జగ్గయ్యపేట నుంచి విజయవాడ వచ్చే అన్ని బస్సులను నిలిపివేస్తున్నారు అధికారులు. ఉదయం 9 గంటల వరకు జగ్గయ్యపేట నుంచి విజయవాడకు బస్సు సర్వీసులు నడవవని అధికారులు చెబుతున్నారు. అయితే, శాంతియుతంగా చేపట్టాలనుకున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని ప్రభుత్వమే భగ్నం చేయాలనుకోవడం దురదృష్టకరమని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను అరెస్ట్‌ చేయడం దుర్మార్గం అని మండిపడుతున్నారు.

Tags:    

Similar News