Kakani Govardhan Reddy: మంత్రి కాకాణి కేసు ఫైల్స్ దొంగతనం కేసులో ట్విస్టులు..
Kakani Govardhan Reddy: కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసు ఫైల్స్ దొంగతనంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి.;
Kakani Govardhan Reddy: మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసు ఫైల్స్ దొంగతనంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఆరోజు రాత్రి దొంగలు ఎత్తుకెళ్లింది అసలు మంత్రి కాకాణికి సంబంధించిన కేసు ఫైల్సే కావని తేలింది. అవన్నీ నెల్లూరు టూటౌన్ పోలీసుల అధీనంలో ఉందని స్పష్టమైంది. కాని, పోయిన పత్రాలన్నీ కాకాణివేనన్న ప్రచారం జరిగింది. చివరికి జిల్లా ఎస్పీ ప్రెస్‌మీట్‌లో చెప్పింది కూడా అదే. కాని, ఇవన్నీ నిజం కావని, కాకాణి ఫైల్స్ అసలు దొంగతనం జరిగిన కోర్టులోనే లేవని తేలిపోయింది.
ఈ ప్రచారం చేసింది కోర్ట్ బెంచ్ క్లర్క్‌గా చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి నాగేశ్వరరావే చేశాడని అంతర్గత విచారణలో స్పష్టమైంది. నెల్లూరు జిల్లా ప్రధాన న్యామూర్తి యామిని.. దొంగతనంపైనా, చోరీ అయ్యాయని చెబుతున్న ఫైల్స్‌పైనా దర్యాప్తు చేసి, ఆ నివేదికను హైకోర్టుకు అందిజేశారు. ఆ నివేదికలో సంచలన విషయాలు ఉన్నాయి. కోర్టులో దొంగతనం జరిగిందన్న విషయాన్ని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామినికి ఈనెల 14న తెలియజేశారు.
చోరీ అయిన వాటిలో.. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కాకాణిపై నమోదైన కేసు పత్రాలతో పాటు నెల్లూరు నాలుగో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరుగుతున్న కేసు ప్రాపర్టీని దొంగిలించారని ప్రధాన న్యాయమూర్తి యామినికి తెలిపారు. దొంగతనం జరిగింది ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను విచారించే ప్రత్యేక కోర్టులోనే. ఇంత వరకైతే వాస్తవమే.
కాని, ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులకు సంబంధించిన రికార్డులన్నింటినీ అప్పటికే విజయవాడలోని ప్రత్యేక కోర్టుకు పంపించేశారు. అంటే, మంత్రి కాకాణి కేసుకు సంబంధించిన ఫైల్స్, ఆధారాలన్నీ కూడా విజయవాడకు చేరిపోయి ఉండాలి. దీంతో దర్యాప్తు చేస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని.. విజయవాడ ప్రత్యేక కోర్టులో వాకబు చేశారు. అన్ని ఫైల్స్ వచ్చాయి గాని, ప్రత్యేకంగా మంత్రి కాకాణికి సంబంధించిన కేసు ఫైల్స్ మాత్రం విజయవాడకు చేరలేదని తేలింది.
మంత్రి కాకాణి కేసు ఫైల్స్ విజయవాడకు పంపించలేదన్న విషయాన్ని నెల్లూరు జిల్లా జడ్జికి కూడా సమాచారం అందించలేదు. అసలు ఆ ఫైల్స్ ఎక్కడున్నాయని ఆరా తీస్తే.. నెల్లూరు టూటౌన్ పోలీసుల అధీనంలోనే ఉన్నాయని తేలింది. అంటే.. దొంగతనం జరిగింది అని చెబుతున్న మంత్రి కాకాణి కేసు ఫైల్స్ అసలు 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లేనే లేవని తేల్చారు.
మరి దొంగతనం అయినవన్నీ మంత్రి కాకాణి కేసు ఫైల్సే అన్న ప్రచారం ఎలా జరిగింది? దీనిపైనా దర్యాప్తు చేశారు. మంత్రి కాకాణి కేసు ప్రాపర్టీ చోరీకి గురైందంటూ బెంచ్ క్లర్క్ నాగేశ్వరరావు గుర్తుతెలియని నిందితులతో కుమ్మక్కై తప్పుడు సమాచారం ఇచ్చారు. ఏవో కల్పిత కథలు చెప్పి కోర్టును తప్పుదోవ పట్టించారు. అసలు కోర్టు పక్కన మురుగు కాలువలో దొరికిన పత్రాలు సైతం మంత్రి కాకాణి కేసుకు సంబంధించినది కాదని తేల్చారు.
దీనిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయిస్తేనే అసలేం జరిగింది, బెంచ్ క్లర్క్ ఎందుకు కట్టుకథ చెప్పాడు అనే వాస్తవాలు బయటకు వస్తాయని హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో తెలిపారు.నివేదికలో మరిన్ని సంచలన విషయాలు కూడా పేర్కొన్నారు. నెల్లూరు కోర్టు వద్ద రక్షణ కోసం 3 ప్లస్ 1 పోలీసు సిబ్బంది ఉంటారు. కాని, చోరీ జరిగిన రోజు మాత్రం పోలీసులు సరైన రక్షణ కల్పించలేదు. దొంగతనంపైనా సరైన దర్యాప్తు కూడా జరగలేదని తేల్చారు.
ఎందుకంటే నిందితులు పగులగొట్టిన తలుపులపై ఉన్న వేలిముద్రలను గాని, సంఘటనా స్థలంలో ఉన్న పాదముద్ర ఆధారాలను గాని పోలీసులు సేకరించలేదు. అసలు డాగ్ స్క్వాడ్‌నే పిలువలేదు. పైగా దొంగల నుంచి రికవరీ చేసిన నాలుగు మొబైల్ ఫోన్లలో రెండు పనిచేయడం లేదు. ఒక మొబైల్‌లో కేవలం సర్వీస్ మెసేజ్‌లు మాత్రమే ఉన్నాయి. మరో మొబైల్ ఫోన్ లాక్ చేసి ఉంది.
రికవరీ చేసిన ల్యాప్‌టాప్‌లో కేసులకు సంబంధించిన వివరాలేవీ లేవు. దీంతో ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయిస్తేనే అసలు వాస్తవాలు బయటికొస్తాయని హైకోర్టుకు పంపిన నివేదికలో తెలిపారు. దీంతో ఈ కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలంటూ చీఫ్ సెక్రటరీ, సీబీఐ డైరెక్టర్, డీజీపీని హైకోర్టు ఆదేశించింది.