నటుడు, దర్శకుడు, సినీ నిర్మాత పోసాని కృష్ణ మురళిని స్థానిక పోలీసులు నరసరావుపేట కోర్టుకు సోమవారం తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని గత ఏడాది నవంబర్ 14న పల్నాడు జిల్లా టీడీపీ నేత కొత్త కిరణ్ నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఈ క్రమంలో ఇటువంటి కేసులోనే రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని నరసరావుపేట టూ టౌన్ సిఐ హైమారావు తన బృందంతో వెళ్లి పీటీ వారెంట్ పై నరసరావు పేట కోర్టుకు తరలించారు. మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆశీర్వాదం పాల్ పోసానికి ఈనెల 13 వరకు రిమాండ్ విధించారు. నరసరావుపేట సబ్ జైల్లో సరైన సదుపాయాలు లేకపోవడంతో ఆయనను అప్పటికప్పుడే గుంటూరు సబ్ జైలుకు తీసుకువెళ్లారు. కాగా పోసాని కృష్ణ మురళిపై యాదమర్రి, పుత్తూరు పోలీస్ స్టేషన్లలో మరో రెండు కేసులు నమోదై ఉన్నాయి. ఒక కేసులో బియ్యం వచ్చేలోపు మరొక కేసులో ఆయనను ఇరికించి ఇబ్బందులు పెడుతున్నారని వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీని వాసరెడ్డి తోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు సంఘీభావంగా వచ్చారు.