Andhra Pradesh: ఏపీలో ముందస్తు ఎన్నికలు నిజమేనా..? రాజకీయ పరిణామాలతో..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతోంది.;
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతోంది. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముందస్తు ఎన్నికలపై హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో ఏ క్షణంలో అయినా ఎన్నికలు రావొచ్చన్నారు. ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉందని ఎవరూ నిద్ర పోవద్దన్నారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అటు టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా అచ్చెన్న జోస్యం చెప్పారు. ఎన్నికలు ఎప్పుడైనా రానీ టీడీపీకి కచ్చితంగా 160 స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తోంది. ఆమధ్య టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని నేతలకు పిలుపునిచ్చారు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా ఈ ఏడాది అక్టోబర్ తర్వాత ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తాజాగా అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు టీడీపీతోపాటు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కొంతకాలంగా ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఊహాగాణాలు ఊపందుకున్నాయి.
జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని, అందుకే కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయని, త్వరలోనే మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయని చెబుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడం, భారీఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో భాగమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.