రుతుపవనాలు ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. మూడు రోజులుగా... ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు కాస్త ఉరట లభించింది. పలుచోట్ల వాగులు ఉద్ధృతంగా ప్రవహించడంతో గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
అల్లూరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రాజవొమ్మంగి మండలం లాగరాయి చప్టా వాగు ఉద్ధృతికి ట్రాక్టర్ వాగులో కొట్టుకు పోయింది. వాగు ఉద్ధృతి నుంచి డ్రైవర్ని స్థానికులు అతికష్టం మీద బయటికి తీసుకొచ్చారు. వాగు ఉద్ధృతంగా పారడం వల్ల ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షం కురిసినప్పుడల్లా 5 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని స్థానికులు వాపోయారు.
నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల కడపలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో ఆకాశమంతా మేఘాలు కమ్ముకొని... ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఊరటనిచ్చింది. అరగంట పాటు కురిసిన భారీ వర్షానికి... రోడ్లన్నీ జలమయమయ్యాయి. మురుగు కాలువలు పొంగి ప్రవహించడంతో... వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడ్డారు. అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఒకసారిగా వర్షం రావడంతో ఉరవకొండలో చిరు వ్యాపారులు, తొపుడుబండ్ల వారు ఇబ్బందిపడ్డారు.
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో కుండపోత వర్షం కురిసింది. ప్రధాన రహదారులపై భారీగా వర్షం నీరు చేరింది. PRT సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ ప్రధాన రహదారిపైకి వర్షపునీరు చేరడంతో... వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సుమారు గంటపాటు కురిసిన వర్షానికి పట్టణంలోని వీధులు జలమయమయ్యాయి.