Ap Rain Alert : ఏపీకి మరోసారి వాన గండం .. రాయలసీమ, దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన
Ap Rain Alert : ఏపీకి మరోసారి వానగండం పొంచి ఉంది. ఇప్పటికే వరద బీభత్సంతో విలవిలలాడుతున్నాయి రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలు. మళ్లీ వర్ష సూచనలతో వణికిపోతున్నారు.;
Ap Rain Alert : ఏపీకి మరోసారి వానగండం పొంచి ఉంది. ఇప్పటికే వరద బీభత్సంతో విలవిలలాడుతున్నాయి రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలు. మళ్లీ వర్ష సూచనలతో వణికిపోతున్నారు. నైరుతి బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం కొమరిన్ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరం మీద ఉంది. దీని ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో ఎల్లుండి అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తరువాత అది బలపడి, పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దిశ మార్చుకుని మొదట ఉత్తరంగా, తరువాత ఈశాన్యంగా పయనించి ఉత్తర బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని వెల్లడించింది.
దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడా భారీ వర్షాలు, అనేకచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, శ్రీకాకుళం, విజయనగరం మినహా, మిగతా జిల్లాల్లో మోస్తరుగా పడనున్నాయి.
రేపు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చాలా ప్రాంతాలు, రాయలసీమలో దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో, 30న ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరిలోనూ తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించింది.