రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు: వాతావరణ శాఖ
నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.;
రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలలో ఈ రోజు, రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉంటుందని, దక్షిణ కోస్తా ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
రేపు దక్షిణ కోస్తాలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అటు రాయలసీమలో ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలతో పాటు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు.