RAINS: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
పలు జిల్లాల్లో నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
వాయుగుండం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లోనూ వర్షం కురిసింది. సూర్యాపేటతోపాటు పలు జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
క్షేత్రస్థాయిలో రంగనాథ్
మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో హైదరాబాద్ నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రెవెన్యూ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. ఎంజీబీఎస్‌కు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాల వల్ల ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని రంగనాథ్ సూచించారు. హైడ్రా సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు
తెలంగాణలోని జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీగా వరదనీరు విడుదలవుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో.. అధికారుకు 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 4,04,658 క్యూసెక్కులు ఉండగా.. ప్రస్తుతం 3,81,392 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 5 వేల క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,237 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.