తిరుమల లడ్డూ పవిత్రతను పెంచేందుకు ప్రస్తుత టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు గారు సమూల మార్పులు చేస్తున్నారు. స్వచ్ఛతను పాటిస్తూ పరిశుభ్రమైన నెయ్యిని అందించే డెయిరీలకు టెండర్లు ఇస్తూ తిరుమల ప్రాముఖ్యతకు పెద్ద పీట వేస్తున్నారు. భక్తుల నమ్మకాన్ని పెంచే విధంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు బీఆర్ నాయుడు గారు. ఇందులో భాగంగా తాజాగా టెండర్లు ఇచ్చేందుకు సమూల మార్పులు చేశారు. నాణ్యత ప్రమాణాల ప్రకారం అర్హత సాధించిన డెయిరీలకు మాత్రమే టెండర్లు ఇస్తున్నారు. నందిని, మదర్, ఇందాపూర్, సంగం డెయిరీలు అర్హత సాధించాయి కాబట్టే వాటికి టెండర్లను కట్టబెట్టారు.
ప్రీమియర్ అగ్రి డెయిరీ, కల్హాపూర్ గోకుల్ డెయిరీ, గోవింద్ మిల్క్ డెయిరీలు నాణ్యతా ప్రమాణాల ప్రకారం అర్హత సాధించలేవు కాబట్టే వాటికి టెండర్లను ఇవ్వలేదు. ఇక వైసీపీ చెబుతున్నట్టు నందిని డెయిరీని పక్కన పెట్టింది కూడా పూర్తిగా అవాస్తవం. తిరుమలకు 62 శాతం నెయ్యిని ఇప్పటికీ నందిని డెయిరీ సరఫరా చేస్తోంది. కానీ వైసీపీ హయాంలో 2019–24 మధ్య నందిని డెయిరీకి ఎలాంటి టెండర్లు ఇవ్వలేదు. ఇక నెయ్యి సేకరణ పరిధిని 1500 కి.మీ నుంచి 800 కి.మీ లకు తగ్గించిన టీటీడీ.. కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఇందులో భాగంగానే నందిని డెయిరీకి 4 టెండర్లు ఇచ్చిన టీటీడీ, ఇందాపూర్ కు రెండు, మదర్ డెయిరీకి రెండు, సంగం డెయిరీకి ఒకటి చొప్పన టెండర్లు కేటాయించింది. ఎన్డీడీబీ నిపుణులు సూచించే ధరలకే ఈ డెయిరీల నుంచి నెయ్యిని కొనుగోలు చేస్తోంది. ఏ మాత్రం నాణ్యత లోపించినా సరే టెండర్లను వెంటనే రద్దు చేస్తామని వార్నింగులు ఇస్తోంది టీటీడీ. శ్రీవారి సేవలో వినియోగించే ప్రతి వస్తువు అత్యంత నాణ్యతతో ఉండేలా బీఆర్ నాయుడు గారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.