Andhra Pradesh : ఏపీ జిల్లాల పునర్విభజన.. ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత - మంత్రి అనగాని
గత ప్రభుత్వం జిల్లాల విభజనను అస్తవ్యస్తంగా చేసిందని, ప్రజలకు ఎన్నో ఇబ్బందులు కలిగించిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ఈ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. జిల్లాల విభజనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను సమావేశంలో చర్చించామని మంత్రి పేర్కొన్నారు. ఈనెల 29, 30 తేదీల్లో మంత్రులు రెండు బృందాలుగా విడిపోయి 13 ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారని తెలిపారు. అక్కడ ప్రజా ప్రతినిధులు, ప్రజలతో సమావేశమై వారి అభిప్రాయాలను, వినతులను స్వీకరిస్తామని చెప్పారు. ఈ గ్రీవెన్స్ ప్రక్రియ సెప్టెంబర్ 2 నాటికి పూర్తవుతుందని, ప్రజలు తమ వినతులను తమ జిల్లాల కలెక్టర్లకు కూడా సమర్పించవచ్చని ఆయన స్పష్టం చేశారు.
అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక సమర్పిస్తామని, దాని ఆధారంగా సీఎం తుది నిర్ణయం తీసుకుంటారని మంత్రి తెలిపారు. డిసెంబర్ చివరి నాటికి జిల్లాల సరిహద్దుల మార్పుల ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అయితే, నియోజకవర్గాల్లో ఎలాంటి మార్పులు ఉండవని, కేవలం జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులను మాత్రమే మార్చగలుగుతామని ఆయన వివరించారు.
పరిపాలన సౌలభ్యమే ప్రధాన లక్ష్యం:
కొన్ని ప్రాంతాలు జిల్లా కేంద్రాలకు 150 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, పోలవరం ముంపు ప్రాంతాల్లో కూడా పర్యటిస్తామని తెలిపారు. పరిపాలనా సౌలభ్యానికి, ప్రజల సౌకర్యానికి తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, కొత్త జిల్లాల ఏర్పాటుపైనా సమగ్రంగా చర్చిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు.