revanth: మోదీని ఓడించి తీరుతాం: రేవంత్రెడ్డి
మోదీతో రాజ్యాంగానికి ప్రమాదం... కాంగ్రెస్ న్యాయసదస్సులో సీఎం ఫైర్... హస్తం పార్టీది ఎప్పుడూ ప్రజా పక్షమే;
స్వాతంత్య్ర సాధన కోసమే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంగ్లేయులను దేశం నుంచి పారద్రోలి దేశానికి స్వాతంత్య్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ప్రశంసించారు. ఢిల్లీలోజరుగుతున్న కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రెండు చెంప దెబ్బలు కొట్టయినా వక్ర మార్గంలో ఉన్న నేతలను దారిలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోందని పేర్కొన్నారు. బిజెపి, బిఆర్ఎస్, జెడి, బిజెపి, ఆర్జెడి, టిఎంసి, డిఎంకె, అన్నాడిఎంకెతో ఏ పార్టీ అయినా స్వాత్రంత్యం తరువాతే వచ్చాయని తెలియజేశారు. దేశంలో సామాజిక న్యాయం, దళితులు, ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ అని, ఇతర పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే కూర్చీలో… ఓడితే ఇంట్లో కూర్చుంటాయని, ఎన్నికల్లో ఓడినా, గెలిచినా ప్రజల మధ్యే ఉన్న పార్టీ కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని బీజేపీ ప్రశ్నిస్తోందని 140 ఏళ్ల కిందటే ఈ దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చేందుకు కదంతొక్కిందే కాంగ్రెస్ పార్టీ అని బ్రిటీష్ పాలకులను తరిమికొట్టింది కాంగ్రెస్సే రేవంత్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, 11 ఏళ్లుగా సామాజిక న్యాయం కోసం ఆలోచించడంలేదని, దేశానికి మార్గదర్శనం కోసం మనుసింఘ్వీ నేతృత్వంలో సదస్సు నిర్వహించడం గొప్పవిషయమన్నారు.
మోదీని ఓడిస్తాం
బీజేపీ, మోడీలను ఓడించడానికి మేం తక్కువ కాదు.. రానున్న ఎన్నికల్లో మోడీ, బీజేపీని ఓడిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. సోనియాను ప్రధాని చేయాలని అందరూ కోరినా.. మన్మోహన్ సింగ్ కు అవకాశం ఇచ్చారు.. రాష్ట్రపతి అవకాశం వచ్చినా ప్రణబ్ ముఖర్జీకి ఛాన్స్ ఇచ్చారు.. త్యాగాలకు మారు పేరు గాంధీ కుటుంబం.. ప్రధాని, కేంద్ర మంత్రి పదవులు రాహుల్ గాంధీ తీసుకోలేదు.. దేశంలో ప్రజల కోసం, సామాజిక న్యాయం కోసం ఆయన పోరాడుతున్నారు.. 2001 నుంచి మోడీ కుర్చీ వదలడం లేదు.. 75 ఏళ్లు నిండిన వాళ్ళు కుర్చీ వీడాలని మోహన్ భగవత్ అన్నారు.. కానీ, మోడీ మాత్రం వదలడం లేదని సెటైర్లు వేశారు. ఆర్ఎస్ఎస్ మోడీని తప్పించక పోతే.. రానున్న ఎన్నికల్లో మోడీని రాహుల్ ప్రధాని కుర్చీ నుంచి తప్పిస్తారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 150 స్థానాలకు మించి రావని విమర్శించారు. ఇక, తెలంగాణలో కులగణన చేసి.. దేశానికి రోల్ మోడల్ గా నిలిచామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ మోడీతో తలపడి బీజేపీకి 150 కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుటుంబం సిద్ధంగా ఉందన్నారు