AP Revenue Meetings: నేటి నుంచే రెవెన్యూ సదస్సులు
17 వేల 564 గ్రామాల్లో నిర్వహణకు ఏర్పాట్లు..;
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పేరుకుపోయిన భూ సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పేరుకుపోయిన భూ సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జనవరి 8వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 17 రెవెన్యూ గ్రామాల్లో 33 రోజులపాటు సదస్సుల నిర్వహణ ఉంటుంది. అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. అలా స్వీకరించినర్జీలపై సదస్సులో చర్చించి వీలైనంతవరకు అక్కడికక్కడే సమస్యకు పరిష్కారం చూపుతారు. తీసుకున్న ప్రతి పిటిషన్‌కు రసీదు ఇస్తారు. సదస్సుకు ముందే గ్రామంలో అధికారులు పర్యటిస్తారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లాలో 753 గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మండల రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
వైసీపీ పాలనలో నిర్వీర్యం
గత వైసీపీ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారంపై పూర్తిగా నిర్లక్ష్యం చేసిన సంగతి తెలిసిందే. రీసర్వే పేరుతో కాలం వెళ్లదీసిందే తప్ప భూ యజమానుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించలేదు. భూముల సమగ్ర రీసర్వే మాటున వైసీపీ నాయకులు ప్రభుత్వం భూములను తమ పేరున మార్చుకున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. జిరాయి భూములకు సంబంధించి పట్టాదారు పాస్‌పుస్తకంలో వున్న విస్తీర్ణం కన్నా తక్కువ చూపించారు. వీటిపై ‘స్పందన’ కార్యక్రమంలో ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం భూ సమస్యలకు పరిష్కారం చూపాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలో 753 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ టెలీకాన్ఫరెన్స్‌లో మండల రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
వినతుల స్వీకరణ
గ్రామ సభల్లో ఫ్రీహోల్డ్, 22ఏకు సంబంధించిన భూములు, ఇతరత్రా భూ సమస్యలు, వివాదాలపై వినతులు స్వీకరిస్తారు. జాయింట్ కలెక్టర్ జాహ్నవి సదస్సుల నిర్వహణకు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. మండల రెవెన్యూ అధికారులు రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఆయా గ్రామాల్లో ఉదయం తొమ్మిది గంటలకు సదస్సులు ప్రారంభం అవుతాయి. తహసీల్దారు, ఆర్‌ఐ, సంబంధిత వీఆర్‌ఓ, సర్వేయర్, రిజిస్ట్రేన్ శాఖ ప్రతినిధి, అటవీ, దేవదాయ, వక్ఫ్‌బోర్డు సిబ్బందితో కూడిన బృందాలు రెవెన్యూ సదస్సులకు హాజరవుతాయి. ఏ రోజు, ఏ గ్రామంలో రెవెన్యూ సదస్సు జరుగుతుందో ముందుగానే ఆయా గ్రామాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతోపాటు ప్రజలకు తెలియపరచాలి. రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు ఇచ్చిన అర్జీలకు రశీదులు ఇచ్చి, వివరాలను సంబంధిత పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. ప్రభుత్వం చెప్పిన మేరకు భూ సమస్యలకు 45 రోజుల్లో పరిష్కారం చూపాల్సి వుంటుంది.