Tirupati : చంద్రగిరి వద్ద లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు
తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం అగరాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. ముందు వెళ్తున్న గ్రానైట్ లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బెంగళూరు నుంచి తిరుపతికి వస్తుండగా, బస్సు డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను వెంటనే తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు.