SAJJALA: సజ్జల భార్గవరెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
మీ పోస్టులు మాకు అర్థం కాలేదనుకున్నారా... అని సుప్రీంకోర్టు సూటి ప్రశ్న;
వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డికి.. సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులకు సంబంధించిన కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అరెస్ట్ నుంచి 2 వారాల పాటు మధ్యంతర ఉపశమనం కల్పించింది. ఆలోపు ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు కేవలం రెండు వారాల గడువును ఇచ్చింది. సోషల్ మీడియా దుర్వినియోగం కేసుల్లో త్వరగా బెయిల్ వస్తుందని అనుకోవద్దని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. త్వరగా బెయిల్ వస్తుందని అనుకుంటే ప్రతి ఒక్కరూ ఇష్టారీతిన వ్యవహరిస్తారని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి తప్పు ఎవరు చేసినా తప్పేనని అభిప్రాయపడింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై నమోదైన కేసుల్లో తనపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలని భార్గవరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
విచారణ సందర్భంగా సజ్జల భార్గవరెడ్డిపై జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టులపైనా తీవ్ర అభ్యంతరం తెలిపింది. ‘‘సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులు మాకు అర్థం కాలేదనుకున్నారా? అని సూటిగా ప్రశ్నించింది. ఏ ఆలోచనతో పోస్టులు పెట్టారో ఆ మాత్రం తాము తెలుసుకోలేమా? అని ధర్మాసనం నిలదీసింది. ఆ పోస్టులు భరించరాని స్థాయికి వెళ్లాయని.... తప్పు ఎవరు చేసినా తప్పేనని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇలాంటి వాటిని వ్యవస్థ క్షమించదని.... తప్పక శిక్షిస్తుందన్న సుప్రీంకోర్టు... సోషల్ మీడియా దుర్వినియోగం కేసుల్లో త్వరగా బెయిల్ వస్తుందనుకోవద్దని తేల్చి చెప్పింది. అలా బెయిల్ వస్తే ప్రతి ఒక్కరూ ఇష్టారీతిన వ్యవహరిస్తారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.