సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ

Update: 2021-01-29 07:40 GMT

SEC నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ ఏపీ గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం లక్ష్మణరేఖ దాటారన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తనపై రాజకీయ విమర్శలతో ఎదురుదాడి చేశారంటూ గవర్నర్‌కు తెలిపారు.

ప్రధానంగా ప్రభుత్వ సలహదారు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి.. తనపై తీవ్రమైన విమర్శలు చేశారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు నిమ్మగడ్డ. రెండ్రోజుల నుంచి ఎన్నికల కమిషన్‌పై సజ్జల చేస్తున్న విమర్శలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి..బాధ్యతాయుతమైన విధుల్లో ఉన్న వారిని విమర్శించడం రాజ్యాంగ ఉల్లంఘనేనన్నారు. ఎన్నికలపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా.. రాజ్యాంగ వ్యవస్థపై విమర్శలు కొనసాగిస్తున్నారంటూ లేఖలో పేర్కొన్నారు నిమ్మగడ్డ.

రాష్ట్ర ప్రభుత్వంపై తనకు నమ్మకం లేదని, సజ్జలపై అటార్న్ జనరల్‌ అభిప్రాయం కొరాలని లేఖలో పేర్కొన్నారు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌. సజ్జలతో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స, పెద్దారెడ్డిలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. రాష్ట్రంలో ఎన్నికలను స్వేచ్చాయుత వాతావరణంలో నిర్వహించాలన్న ఎస్‌ఈసీ ప్రణాళికలు అడ్డుకునేలా వీరంతా వ్యవహరిస్తున్నారని తన లేఖలో పేర్కొన్నారు. ఎస్‌ఈసీపై మంత్రులు చేసిన వ్యాఖ్యలను లేఖలో గవర్నర్‌ దృష్టికి తీసుకొచ్చారు.

Tags:    

Similar News