భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపంతో పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 46.5 అడుగులకు చేరుకుంది. ఇది 73 అడుగులకు చేరితే 109 గ్రామాలు, ఒక పట్టణం నీట మునుగుతాయని నీటి పారుదల శాఖ ప్రకటించింది. 48 అడుగులకు చేరినప్పటి నుంచే వరసగా గ్రామాల ముంపు మొదలవుతుందని వెల్లడించింది. మండలాల వారీగా చర్లలో 26, దుమ్ముగూడెం 51, బూర్గంపాడు 5, అశ్వాపురం 11, మణుగూరు 6, పినపాకలో 10 గ్రామాలు వరద ముప్పులో ఉన్నాయి.
గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద ఆదివారం సాయంత్రం 7 గంటలకు 43.1 అడుగులకు చేరింది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ నెల 15న మొదలైన వరద కొనసాగుతూనే ఉంది. సోమవారం ఉదయానికి 48 అడుగులకు చేరి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో ప్రవహించే అవకాశాలున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు చెబుతున్నారు. వరద ప్రవాహం పెరుగుతుండటంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని లోతట్టు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.