వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీకి డుమ్మా కొడుతుండటంపై ఏపీ పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదని, వెళ్లకపోతే ఎమ్మెల్యేగా రాజీనామా చేసేయాలని డిమాండ్ చేశారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు అంటూ వ్యాఖ్యానించారు. బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కానీ బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ వైసీపీ కంటే ముందే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందన్నారు. తాము చెప్పిందే జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారన్నారు. మీకూ, మాకు పెద్ద తేడా లేదన్నారు. జగన్ మోహన్ రెడ్డికి 38 శాతం ఓట్లు వచ్చినా అసెంబ్లీకి వెళ్ళనప్పుడు, మీకు మాకు తేడా లేదని గుర్తుచేశారు. 38 శాతం ఓట్ షేర్ పెట్టుకొని అసెంబ్లీకి పోనీ వైసీపీని నిజానికి ఒక అప్రాధాన్య పార్టీగా మార్చింది జగనే అంటూ మండిపడ్డారు.
అసెంబ్లీలో అడుగు పెట్టలేని, ప్రజా సమస్యల కోసం సభల్లో పట్టుబట్టలేని వ్యక్తి జగన్ అన్నారు షర్మిల. పాలకపక్షాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని , అసమర్థ వైసీపీ ఇవ్వాళ రాష్ట్రంలో అసలైన అప్రాధాన్య పార్టీ అంటూ మండిపడ్డారు. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదన్నారు. సొంత మైకుల ముందు కాదు..అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని జగన్ కు షర్మిల సూచించారు. ప్రతిపక్షం కాకపోయినా 11 మంది ప్రజాపక్షం అనిపించుకోవాలని షర్మిల సూచించారు. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయాలన్నారు. ఎన్నికలకు వెళ్ళండి. అప్పుడు ఎవరు ఇన్ సిగ్నిఫికెంట్.. ఎవరు ఇంపార్టెంట్ తేలుతుందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలన్నారు. లేదా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపుపై నిలదీయాలంటూ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు…