SIT:నారాయణస్వామి సిట్ విచారణలో 6 గంటల ఆరా
పాలసీ మార్పు, ముడుపులపై ప్రశ్నలు... అన్నీ వాళ్లే నిర్ణయించారన్న స్వామి;
మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామిని సిట్ అధికారులు శుక్రవారం ఆరా తీశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుత్తూరులోని ఆయన నివాసంలో 6 గంటలపాటు విచారణ సాగింది. 100కు పైగా ప్రశ్నలు అడిగిన సిట్ అధికారులు, ఆయన సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ బృందంతో డేటా సేకరించారు. మద్యం విధానం రూపకల్పన, సరఫరా ఆర్డర్ల మార్పులు, ముడుపుల వ్యవహారాలపై వివరాలు అడిగినా, “అన్నీ పైవాళ్లకే తెలుసు, నేను ఆదేశాలు పాటించా” అని
సమాధానం ఇచ్చినట్లు సమాచారం. కీలక అంశాలపై మౌనం వహించడంతో వైకాపాలో ఆందోళన నెలకొంది. ఈ విచారణ తరువాత తమ అధినాయకుడిపైనా సిట్ దృష్టి పడుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ సమయంలో నారాయణస్వామి కూతురు, స్థానిక నేత కృపాలక్ష్మి ఇంట్లో ఉండగా, పలువురు వైకాపా నేతలు హడావుడి చేయడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి తొలగించారు. నారాయణస్వామి మాత్రం “ప్రశ్నలన్నింటికీ కూల్‌గా సమాధానమిచ్చాను” అన్నారు.
ఫోన్ సీజ్
నారాయణస్వామికి చెందిన ల్యాప్ టాప్‌ను, మొబైల్ ఫోన్‌ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇద్దరు మహిళా వీఆర్వోల సమక్షంలో... పంచనామా నిర్వహించి వీటిని స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు... నారాయణస్వామి వాంగ్మూలాన్ని కూడా వారి సమక్షంలోనే నమోదు చేసిట్టు తెలిసింది. వీఆర్వోల రాకతో నారాయణస్వామిని అరెస్టు చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. దీంతో జీడీ నెల్లూరు నియోజకవర్గం నుంచి కొందరు వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించివేశారు. ఏడుగంటలపాటు విచారణ ప్రక్రియ కొనసాగినా... వైసీపీ ముఖ్యనేతలెవరూ అటువైపు రాకపోవడం గమనార్హం.