AP: వేట్లపాలెం పేలుళ్ల ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుళ్ల ఘటనను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. పేలుడు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడి జరిగిన సహాయక చర్యలపైనా ఆరా తీశారు. ఘటన తీవ్రతను సీఎం చంద్రబాబుకు స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు వివరించారు. బాణాసంచా తయారీ కేంద్రం ఎవరిదని, ఎప్పటి నుంచి ఉందని, అనుమతులు ఉన్నాయా లేవా అని ప్రశ్నించారు. అటు క్షతగాత్రుల ప్రస్తుత పరిస్థితులను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. మరికాసేపట్లో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు. ఈ మేరకు కాకినాడ జీజీహెచ్‌కు వెళ్లనున్నారు.
మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రమాదానికి కారణాలు... ప్రస్తుతం అక్కడ అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. పెద్ద సంఖ్యలో బాణాసంచా తయారీదారులు ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులను, ఉన్నతాధికారులను ఘటనా స్థలానికి వెళ్లి, సహాయ చర్యల్లో పాల్గొనాలని సీఎం ఆదేశించారు. కాకినాడ జిల్లాలో జరిగిన బాణసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటనపై మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ భారీ పేలుడు విషాదకరమని, తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.
పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణాసంచా పరిశ్రమలో జరిగిన భారీ విస్ఫోటనంలో పలువురు మృతి చెందారని తెలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై తెలియగానే జిల్లా కలెక్టర్‌తో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలంలో ఉండి పరిస్థితిని, సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాణాసంచా పరిశ్రమలపై అధికారులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచి భద్రత చర్యలను తనిఖీ చేయాలని ఆదేశించారు. పరిసర గ్రామాలకు పొగ అలుముకున్న క్రమంలో ఆయా గ్రామాల ప్రజలకి ధైర్యం చెప్పి, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌లను ఘటన స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.