AP: కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. 18 మంది సజీవ దహనం?

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

Update: 2026-02-28 10:12 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో భయానక విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెం పరిధిలో గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్‌ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా వినిపించిన భారీ శబ్దాలతో పరిసర ప్రాంతాలు వణికిపోయాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 18 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమై మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 20 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పేలుడు తీవ్రతకు భవనం పూర్తిగా ధ్వంసమై మంటలు ఎగిసిపడ్డాయి. మృతదేహాలు ఛిన్నాభిన్నమై గాలిలోకి ఎగిరిపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మంటల్లో చిక్కుకున్న మరో 15 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన 8 మందిని అంబులెన్స్‌లలో సమీప ఆస్పత్రులకు తరలించారు.

పేలుడు శబ్దాలు సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వరకు వినిపించాయని స్థానికులు వెల్లడించారు. శబ్దం తీవ్రతకు పక్క గ్రామంలోని ఒక ప్రైవేట్ పాఠశాల భవన స్లాబ్‌కు పగుళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. సమీపంలోని కొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఘటనాస్థలమంతా దట్టమైన పొగతో కమ్ముకుపోయింది.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది రెండు ఫైర్‌ ఇంజిన్లతో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. పోలీసులు కూడా ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ ప్రత్యక్షంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పరిమితికి మించి బాణసంచా తయారీ చేయడం వల్లే ప్రమాదం సంభవించి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పేలుడు కారణాలపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మాత్రమే అసలు కారణాలు వెల్లడికానున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. ఈ బాణసంచా పరిశ్రమను అడపా నాని కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా

ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. తక్షణం సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. హోం మంత్రి అనితను వెంటనే ఘటనాస్థలికి వెళ్లాలని సూచించారు. దీంతో హోం మంత్రి సంఘటన స్థలికి బయల్దేరారు. ఈ దారుణ ఘటనతో వేట్లపాలెం గ్రామం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఒక్కసారిగా కుటుంబాలను కోల్పోయిన బాధితుల ఆర్తనాదాలతో ప్రాంతమంతా మ్రోగిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రమాదం కలకలం రేపింది. అధికారుల పూర్తి నివేదిక వెలువడిన తర్వాతే మరిన్ని వివరాలు తెలియనున్నాయి

Tags:    

Similar News