AP News: ముగ్గురు ఐపీఎస్‌లపై అభియోగాల నమోదు

క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించిన రాష్ట్ర ప్రభుత్వం;

Update: 2024-05-21 02:30 GMT

 ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసిన ముగ్గురు అధికారులపై జగన్‌ ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. అనంతపురం, పల్నాడు ఎస్పీలు అమిత్‌ బర్దర్, బిందుమాధవ్‌ గరికపాటి, బదిలీ వేటుకు గురైన తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌పై అఖిలభారత సర్వీసుల నియమావళిలోని ఎనిమిదో నిబంధన ప్రకారం ఈ ముగ్గురిపై అభియోగాలు నమోదు చేసింది.

ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసిన ముగ్గురు ఐపీఎస్‌ అధికారులపై అభియోగాలు మోపిన జగన్‌ ప్రభుత్వం...15రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా నేరుగా సంబంధిత అధికారి ముందు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. నమోదు చేసిన అభియోగాలకే వాదనలు పరిమితం కావాలని సూచించారు. నిర్దేశిత గడువులోపు వాదనలు వినిపించకపోతే...తమ వద్ద ఉన్న వివరాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని...CS హెచ్చరించారు. కేసు విచారణలో రాజకీయ నేతలతో లేదా ఇతరులతో ఒత్తిడి తీసుకురావటంసహా సిఫార్సులు చేయించకూడదని స్పష్టం చేశారు. అలాచేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని CS వెల్లడించారు. పోలింగ్‌ రోజున పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ శాంతిభద్రతల పరిరక్షణలో ఘోరంగా విఫలమయ్యారు. అల్లరిమూకలు 15ఈవీఎంలను ధ్వంసం చేశాయి. ఒక్కరోజే జిల్లాలో 20 హింసాత్మక ఘటనలు జరిగాయి. తగినంత మంది పోలీసులు, భద్రతా సిబ్బంది అందుబాటులో ఉన్నా హింసను ఆపటంలో ఎస్పీ విఫలమయ్యారు. పోలింగ్‌ మర్నాడు రాళ్లు విసరడం, ఆస్తుల ధ్వంసం వంటి హింసాత్మక ఘటనలు జరిగాయి. అనంతపురం ఎస్పీగా అమిత్‌ బర్దర్‌ ఈనెల 13, 14 తేదీల్లో తాడిపత్రిలో చెలరేగిన హింసాకాండను అరికట్టలేదన్న ఆరోపణలున్నాయి. రెండురోజులపాటు ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవటం, పోలీసు వాహనాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు జరిగాయి. ఈ ఘర్షణల్లో పోలీసులు కూడా గాయపడ్డారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల అనుచరులు తాడిపత్రిలో ఘర్షణ వాతావరణం సృష్టించినా ఎస్పీ పట్టించుకోలేదు. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌...హింసాత్మక ఘటనల నివారణకు ముందుస్తు చర్యలు తీసుకోలేదు.చంద్రగిరిలో గత ఎన్నికల సమయంలోనూ హింస చెలరేగింది. అయినా ఎస్పీ ముందస్తు చర్యలు చేపట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. పోలింగ్‌ రోజు వైకాపా అభ్యర్థి వాహనాన్ని తెలుగుదేశం శ్రేణులు తగలబెట్టాయి. మర్నాడు తిరుపతిలో తెలుగుదేశం అభ్యర్థిపై వైకాపా వర్గీయులు దాడిచేశారు. భద్రతాసిబ్బంది గాల్లోకి రెండురౌండ్ల కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇరుపార్టీల శ్రేణులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. 144 సెక్షన్‌ విధించినా హింసాత్మక ఘటనలు జరగటం పూర్తిగా నిఘా వైఫల్యమనే విమర్శలు ఉన్నాయి

Tags:    

Similar News