STAMPADE: అతి ప్రచారం.. ఆర్భాటం.. అనూహ్య రద్దీ
తొక్కిసలాటకు అవే ప్రధాన కారణం.. అన్నింటికీ ఎక్కువైన అతి ప్రచారం.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
అన్నిటికీ ప్రచారం ఎక్కువ అయింది. ప్రత్యేకమైన రోజు ఫలానా దేవుడి దర్శనం అమోఘం, అత్యంత అద్భుతం అని ఊదరగొట్టే వాళ్లు ఎక్కువ అయిపోయారు. మరి అది తప్పని, అవసరం లేదని ఎందుకు ఎవరూ చెప్పడం లేదు. ప్రచారం కూడా చేయడం లేదు. అన్నీ అయిపోయాక దీర్ఘాలు తీసి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండగ రోజుల్లో ఆ ఆలయాన్ని సందర్శించండి, ఆయా పూజలు చేస్తే పుణ్యం, మోక్షం. అంతేకాదు మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై పలువురు విశ్లేషణలు చేస్తుండటం, భారీగా లైక్లు, లక్షల్లో వ్యూస్ రావటంతో వాటిని చూసిన వారు మరింత ప్రభావితమవుతున్నారు. అలా అయిన క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో జరిగిన ఘటన. ఈ ప్రమాదంలో 9 మంది మృత్యువాత పడ్డారు. పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆలయాలు, పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకోండి’ అంటూ ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియాల్లో చిత్రాలు, వీడియోలు పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలను అనుసరిస్తున్న వారు ఆ విశేషాలు తెలుసుకోవడం వరకు బాగానే ఉన్నా ఊహించని విధంగా ఒకేచోటకు వేల మంది తరలి వస్తుండటంతో రద్దీ ఏర్పడుతోంది. అదే ప్రమాదాలకు కారణమవుతోంది. తిరునాళ్లు, జాతరలు తెలుగు ప్రజలకి కొత్తకాదు. ఎంతో సంబరంగా, ఉత్సాహంగా వాటిని నిర్వహించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. లక్షల్లో జనం గుమిగూడినా, రేయింబవళ్లు వేచి చూసినా ఆ కార్యక్రమాలు ఎంతో సజావుగా గడిచిపోయేవి. అయితే ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు అలా లేదు.
ప్రచార వేదికలకూ భాగం..
భీతావహంగా ఉన్న ఈ దృశ్యాలని చూసిన వారంతా అయ్యో అని కన్నీరుపెట్టారు. అయితే.. ఈ ప్రమాదం దానంతట అదే వచ్చిపడింది కాదు. నిర్వాహకులు, యంత్రాంగ లోపం ప్రధానంగా కనిపిస్తున్నా, మరో కోణం కూడా ఎవరికి వారే పరిశీలించుకోవాలి. ఈ మధ్యకాలంలో ప్రధాన స్రవంతి టివి కార్యక్రమాల్లో సోషల్మీడియాలో ఇలాంటి పూజా క్రతువుల గురించి విశేషప్రచారం చేస్తున్నారు. ఇటీవల విశాఖలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆహారోత్సవం నిర్వహించగా సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేశారు. ఒకేసారి ఎక్కువ మంది తరలిరావడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఆహారోత్సవం నిర్వహిస్తున్న ప్రదేశంలో గందరగోళం నెలకొంది. సందర్శకులు ఆహారం కోసం ఎగబడడంతో పరిస్థితి తోపులాటకు దారి తీసింది.
నిర్వహణ లోపం
ప్రధానంగా ఈ ఘటనకు నిర్వహణ లోపం, భద్రతను పట్టించుకోకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. పాత జాతీయ రహదారికి, రైల్వే, బస్స్టేషన్లకు సమీపంలో ఉండటం, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నేపథ్యంలో ఈ ప్రైవేటు ఆలయానికి రోజుకు రెండు వేల మంది వరకు భక్తులు వస్తుంటారు. పండుగరోజుల్లో అన్నసంతర్పణ నిర్వహిస్తుండటంతో ఈ సంఖ్య పెరుగుతున్నా ఆలయ యాజమాన్యం వైపు నుంచి భద్రత చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు.