Vallabhaneni Vamsi Case : వల్లభనేని వంశీపై పోలీసుల చేతిలో బలమైన సాక్ష్యాధారాలు
కిడ్నాప్, దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా పోలీసులు బలమైన సాక్ష్యాలు సేకరించారు. సాంకేతిక ఆధారాలన్నీ పక్కాగా తీసుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ రాయదుర్గంలో వంశీ నివసిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ వద్ద సీసీ కెమెరాల్లో ఫుటేజీని తీసుకున్నారు. ఇందులో పలు కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. సత్యవర్ధన్‌ను విశాఖకు తీసుకెళ్లి తొలుత చేబ్రోలు శ్రీనుకు చెందిన ఫ్లాట్‌లో ఉంచారు. అనంతరం హోటల్‌కు తరలించారు. ఈ రెండుచోట్లా సీసీ కెమెరాల్లో వంశీ అనుచరులు సత్యవర్ధన్‌ను తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. వీటిని విజయవాడ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం స్వాధీనం చేసుకుంది.
మరోవైపు వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసులో టీడీపీ కీలక ఆధారాలు బయట పెట్టింది. పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో టీడీపీ సీసీ ఫుటేజ్ ని విడుదల చేసింది. హైదరాబాద్ లోని రాయదుర్గంలో వల్లభనేని వంశీ నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోని సీసీ ఫుటేజ్ తెలుగుదేశం పార్టీ వెలుగులోకి తెచ్చింది. ఈ ఫుటేజ్ వంశీ కేసులో కీలకంగా మారింది. సత్యవర్ధన్ తో కలిసి వంశీ లిఫ్ట్‌లో వెళుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. వంశీతో పాటు ఆయన అనుచరులు సత్యవర్ధన్‌ను తన ఇంటికి తీసుకెళ్తున్న విజ్యువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈనెల 11న 9.53 నిమిషాలకు వెళ్తున్నట్లు సీసీ ఫుటేజ్‌లో రికార్డయింది.