TDP-JANASENA: అరాచక పాలనపై అలుపెరగని పోరాటం

టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ భేటీ... వైసీపీ దోపిడీపై ఉమ్మడిపోరు సాగించాలని నిర్ణయం..

Update: 2023-10-30 01:30 GMT

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అరాచక పాలనపై అలుపెరగని పోరాటం చేయాలని తెలుగుదేశం, జనసేన నిర్ణయించాయి. రెండు పార్టీల మధ్య సమన్వయానికి ఉమ్మడి జిల్లాల స్థాయిలో తలపెట్టిన సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజమండ్రిలో ఈ నెల 23న టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆధ్వర్యంలో జరిగిన రెండు పార్టీల సంయుక్త కార్యాచరణ సమితి సమావేశానికి కొనసాగింపుగా 5 జిల్లాల్లో సదస్సులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ సర్కారుపై ఉమ్మడి పోరుకు తెలుగుదేశం, జనసేన సిద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుల్లో భాగంగా ఉమ్మడి ఐదు జిల్లాల్లో సంయుక్త సమావేశాలు నిర్వహించారు. శ్రీకాకుళంలో జరిగిన సమావేశానికి పార్టీల సమన్వయకర్తలుగా వంగలపూడి అనిత, జనసేన నేత బొమ్మిడి నాయకర్‌ వ్యవహరించారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, కూన రవికుమార్‌, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి పాల్గొన్నారు.

విజయనగరంలో పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశానికి టీడీపీ తరఫున అశోక్‌గజపతిరాజు, గుమ్మిడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, కిమిడి నాగార్జున హాజరయ్యారు. ప్రజాస్వామ్య రక్షణకు కలిసి పనిచేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయని సమావేశంలో పాల్గొన్న జనసేన జిల్లా పరిశీలకుడు కోన తాతారావు తెలిపారు. కాకినాడలో రెండు పార్టీల సమన్వయకర్తలుగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన నేత శివశంకర్‌ వ్యవహరించారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న వైసీపీని గద్దె దించడమే అందరి లక్ష్యం కావాలన్నారు. అనంతపురం జిల్లా సమావేశానికి టీడీపీ నుంచి మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డితో పాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు. జనసేన నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు వరుణ్‌, నాయకులు భవానీ రవికుమార్‌ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన సమన్వయ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, బాలవీరాంజనేయస్వామి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తో పాటు జనసేన నేతలు షేక్‌రియాజ్‌, పెదపూడి విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న వైసీపీను గద్దె దించడమే అందరి లక్ష్యం కావాలని నేతలు తీర్మానం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తుకు టీడీపీ, జనసేన కలయిక మేలు చేస్తుందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, జనసేన అనంతపురం జిల్లా పరిశీలకులు చిల్లపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సమావేశానికి టీడీపీ నుంచి మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్‌, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, శ్రీసత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షుడు బీకే పార్థసారథి, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు ప్రభాకర్‌ చౌదరి, కందికుంట వెంకటప్రసాద్‌, ఉమామహేశ్వరనాయుడు, పరిటాల శ్రీరామ్‌, జితేంద్రగౌడ్‌, ఈరన్న, అస్మిత్‌రెడ్డి, ఆలం నరసానాయుడు, ఉన్నం హనుమంతరాయచౌదరి, బండారు శ్రావణి, సవిత, శ్రీధర్‌చౌదరి, తలారీ ఆదినారాయణ, గౌస్‌మోహీద్దీన్‌, జనసేన నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు వరుణ్‌, నాయకులు భవానీ రవికుమార్‌, చిలకం మధుసూదన్‌రెడ్డి, పెండ్యాల శ్రీలత పాల్గొన్నారు.

Tags:    

Similar News