TDP: విశాఖ జగదాంబ జంక్షన్ వద్ద టీడీపీ మహిళా విభాగం నిరసన
TDP: ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమను పోలీసులు అన్యాయంగా అడ్డుకుంటున్నారని మహిళా నేతలు ఆరోపిస్తున్నారు.;
TDP: విశాఖ జగదాంబ జంక్షన్ వద్ద టీడీపీ మహిళా విభాగం నిరసనకు దిగింది. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల నిర్భందాన్ని మహిళా నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమను పోలీసులు అన్యాయంగా అడ్డుకుంటున్నారని మహిళా నేతలు ఆరోపిస్తున్నారు.
అరెస్ట్ అయిన వారిలో విశాఖ లోక్‌సభ మహిళా విభాగం అధ్యక్షురాలు అనంతలక్ష్మితో పాటు.. మరి కొంత మంది మహిళా నేతలు ఉన్నారు.
టీడీపీ నేతల నిరసనలు, ఆందోళనలతో ఏపీ దద్దరిల్లుతోంది. పార్టీ ఆఫీసులపై దాడులకు నిరసనగా చేపట్టిన రాష్ట్ర బంద్ ప్రభావం ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. తెల్లవారక ముందే టీడీపీ నాయకుల ఇళ్లకు వెళ్లిన పోలీసులు.. నేతలు ఇంటి నుంచి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు.
అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, కోట్ల సూర్యప్రకాష్ వంటి నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. రోడ్ల మీదకు వచ్చిన రామ్మోహన్ నాయుడు, బుద్ధా వెంకన్న, కందికుంట సహా ఇతర ముఖ్య నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ అదుపులోకి తీసుకున్నారు.
ముఖ్య నేతలను గృహ నిర్బంధంలో పెట్టినా, అరెస్ట్ చేసినా.. టీడీపీ శ్రేణులు మాత్రం ఎక్కడా తగ్గలేదు. రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. పలుచోట్ల సీఎం జగన్ దిష్టిబొమ్మలు తగలబెట్టారు. సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఉదయాన్నే ఆర్టీసీ డిపోల ముందు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఏపీవ్యాప్తంగా అన్ని డిపోలు, బస్టాండ్లలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను దింపారు. బస్సులను అడ్డుకోవడంతో పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య చాలా చోట్ల వాగ్వివాదం జరిగింది.
పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో టీడీపీ కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరోవైపు రాష్ట్రంలోని పలుచోట్ల వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. మంగళగిరిలో సినిమా హాళ్లను మూసేశారు.