AP: నేటి నుంచి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
హాజరుకానున్న అతిరథ మహారథులు... దేశవిదేశాల నుంచి 1500 మందికిపైగా ప్రతినిధుల రాక;
నేటి నుంచి విజయవాడలో ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఆరంభం కానున్నాయి. డిసెంబరు 28, 29 తేదీల్లో జరిగే ఈ వేడుకల కోసం దేశవిదేశాల నుంచి 1500 మందికి పైగా ప్రతినిధులు విజయవాడకు తరలివస్తున్నారు. నగరంలోని కె.బి.ఎన్.కళాశాల ప్రాంగణంలో జరిగే రెండు రోజుల వేడుకల కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కవులు, రచయితలు, భాషాభిమానులు, ముఖ్యఅతిథులు ఈ మహా వేడుకకు తరలివస్తున్నారు. పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంలోని వేదికలను సదస్సులు, కవితా, సాహిత్య సమ్మేళనాల కోసం సిద్ధం చేశారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణా జిల్లా రచయితల సంఘం, కె.బి.యన్.కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఆరో మహాసభలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు.
హాజరుకానున్న జస్టిస్ ఎన్వీ రమణ
రెండు రోజుల మహాసభలు జరిగే సదస్సుల్లో ముఖ్య అతిథులుగా 100మందికి పైగా ప్రముఖులు పాల్గొనబోతున్నారు. మొదటిరోజు సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ మహాసభలను ప్రారంభిస్తారు. శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు, ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే సుజనాచౌదరి, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ అతిథులుగా పాల్గొంటారు. రెండు రోజుల సదస్సుల్లో సినీ, రాజకీయ, న్యాయ, ప్రభుత్వ రంగాల నుంచి వంద మందికి పైగా ప్రముఖులు అతిథులుగా హాజరవుతున్నారు. మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, సత్యకుమార్‌యాదవ్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, భారత రక్షణ వ్యవహారాల శాఖ ముఖ్య సలహాదారు డాక్టర్ జి.సతీష్‌రెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారులు ఎ.బి.వెంకటేశ్వరరావు, వి.వి.లక్ష్మీనారాయణ పాల్గొంటారు.
మార్పే లక్ష్యం
తెలుగు భాషను భవిష్యత్తు తరాలకు మరింత చేరువ చేయడానికి.. ఏం మార్పులు తేవాలనే లక్ష్యంతో మహాసభల్లో ప్రధానంగా చర్చ జరగబోతోంది. భవిష్యత్తు తరం కోసం ఇప్పటి మనం ఏ మార్పు కోరుతున్నాం అనే అంశమే ప్రధాన అంశంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. యువ రచయితలు 170 మందితో ‘యువ కలాల సమ్మేళనం’ నిర్వహిస్తున్నారు. పర్యావరణ కవి పురస్కార పత్రాలను వీరికి అందిస్తారు. ప్రతినిధులందరికీ రూ.500 విలువైన ‘మార్పు’ పరిశోధన గ్రంథం, జ్ఞాపిక ఇస్తారు.