తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఘోరంగా పెరుగుతోంది. గత ఐదు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు పలు జిల్లాల్లో 10 డిగ్రీల దిగువకు నమోదు అవుతున్నాయి. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, కోనసీమ, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో జనం గజగజ వణికిపోతున్నారు. మరోవైపు పొగమంచు కమ్మేస్తోంది. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. జనవరిలో ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఉత్తరాది రాష్ట్రాలపై చలిపంజా
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, హర్యాణా, యూపీలో చలి తీవ్రత పెరిగింది. పలుచోట్ల దట్టమైన పొగమంచు కమ్మేసింది. బుధవారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 8.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.