THEFT: ఏకంగా ఆర్టీసీ బస్సు చోరీకి యత్నం
నెల్లూరు జిల్లాలో ఘరానా దొంగ మాస్టర్ ప్లాన్;
ఏకంగా ఆర్టీసీ బస్సును చోరీ చేయాలని ఓ దొంగ ప్లాన్ వేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం రాత్రి నెల్లూరుకు వెళ్లింది. నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండులో పార్క్ చేసి డ్రైవర్ రెస్ట్ రూమ్‌లో నిద్రపోయారు. తెల్లారేసరికి బస్సు కనిపించకపోవడంతో వెంటనే అలర్ట్ అయిన డ్రైవర్ జిలాని ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించారు. చోరీకి గురైన బస్సు బుచ్చిరెడ్డిపాలెం టోల్‌గేట్ వద్ద సీసీ కెమెరాలో రికార్డయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు పాలెం సర్కిల్ వద్ద పోలీసులు బస్సును ఆపి దొంగను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు విడవలూరు మండలం కంచర్ల గ్రామానికి చెందిన బిట్రగుంట కృష్ణగా గుర్తించారు.
బస్సుకు నిప్పు పెట్టిన ఆకతాయిలు
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో ఆకతాయిలు బరితెగించారు. పార్కింగ్‌లో ఉన్న నైట్‌హాల్ట్ ఆర్టీసీ బస్సుకు అర్ధరాత్రి సమయంలో నిప్పు పెట్టారు. మిర్యాలగూడ డిపోనకు చెందిన టీఎస్ 05జెడ్ 0047 నంబర్ బస్సును రోజు మాదిరిగానే గ్రామంలోని ప్రధాన బస్‌స్టాప్ కూడలిలో పార్కింగ్ చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు బస్సు వెనుకవైపు నిప్పంటించడంతో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్, కండక్టర్.. పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారమందించడంతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో బస్సు వెనుక భాగం టైర్లతో సహా పూర్తిగా దగ్ధమైంది. నిప్పుపెట్టిన ఆకతాయిల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే గంజాయి మత్తులోనే ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.