TIRUMALA: వైభవంగా బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు
తిరుమలలో వైభవంగా ధ్వజారోహణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు.. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన టీటీడీ
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం ధ్వజారోహణం వైభవంగా జరిగింది. మీన లగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించిన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాత్రి తొమ్మిది గంటలకు పెద్దశేష వాహన సేవతో బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి ధర్మకర్తల మండలి హయంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. ధ్వజారోహణాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు పోటెత్తారు.
తిరుమల శ్రీవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం చంద్రబాబు దంపతులు, నారా లోకేష్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన పెద్ద శేషవాహనసేవలో చంద్రబాబు కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకుని స్వామివారిని సీఎం చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. అక్కడ నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు, శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు, మంత్రి నారా లోకేష్ దంపతులకు టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని ఆలయాల్లో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశించారు. దాదాపు 5వేల గ్రామాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని టీటీడీ అధికారులకు బోర్డుకు సూచించారు. ‘‘అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు ఉండాలి. ప్రపంచంలో హిందువులు ఉండే అన్ని ప్రాంతాల్లో స్వామి వారి ఆలయాలు నిర్మించాల్సిన అవసరముంది. 17 లక్షల మంది శ్రీవారి సేవకులు ఉన్నారు. బ్రహ్మోత్సవాల్లో 14 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం భగవంతుడు నాకు కల్పించారు.” అని చంద్రబాబు అన్నారు.