తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తిరుమల్లోని రహదారులు, క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు, గ్యాలరీలు అన్నీ భక్తులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరి నుంచి తిరుమలకు వచ్చే రెండో ఘాట్ రోడ్డులో కేవలం బస్సులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది. అలాగే తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మాత్రం ద్విచక్ర వాహనాలకు మినహా అన్ని వాహనాలకు అనుమతి ఇచ్చింది. అయితే ఘాట్ రోడ్డులో బస్సులను మాత్రమే అనుమతి ఇస్తుండడంతో.. బస్సుల్లోకి ఎక్కేందుకు భక్తులు ఎగబడుతున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు.. స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు పోటెత్తారు. దీంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గరుడవాహన సేవ నేపథ్యంలో మాడవీధులు గోవింద నామస్మరణతో నిండిపోయాయి. ఇప్పటికే గ్యాలరీలలో లక్షల సంఖ్యలో భక్తులు చేరారు. టిటిడి అంచనా ప్రకారం, ఈసారి గరుడ వాహన సేవలో 3 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారని అంచనా.
కన్నులపండువగా గరుడ వాహనసేవ
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం గరుడ వాహనసేవ నిర్వహించారు. ఈ నేపథ్యంలో వాహనాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో అలిపిరిలో భారీ రద్దీ నెలకొంది. అలిపిరి టోల్గేట్ వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం అనుమతిస్తున్నారు. తిరుమలలో భక్తులు రద్దీ అధికంగా ఉంది. శ్రీనివాసుడి గరుడ సేవను కనులారా వీక్షించేందుకు శనివారం రాత్రి నుంచే భక్తులు నిరీక్షిస్తున్నారు. ఆదివారం సాయంత్రం గరుడ వాహనసేవను దర్శించుకున్నారు. గ్యాలరీల్లో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది పాలు, బిస్కెట్లు అందజేశారు. 4 మాడ వీధుల్లో పర్యవేక్షణకు 64 మంది ప్రత్యేక సిబ్బంది, 14 మంది ప్రత్యేక అధికారులను టీటీడీ నియమించింది. గరుడ వాహనంపై స్వామివారి విహారం అత్యంత శోభాయమానంగా జరిగింది. స్వామి వైభవాన్ని చుట్టూ మాలలు, లక్ష్మీకాసుల మాలలు, పచ్చల హారం అలంకరించారు. భక్తులు గరుడసేవలో పాల్గొని దాస్యభక్తి పట్ల స్వామి దయను పొందారు. పౌరాణికంగా, 108 వైష్ణవ దివ్యదేశాల్లో గరుడసేవకు అత్యంత ప్రాధాన్యత ఉంది. గరుడుని దర్శించేవారికి సర్వపాపాలు తొలగిపోతాయని, జ్ఞానవైరాగ్యానికి దారి ఏర్పడుతుందని భక్తులు విశ్వసిస్తారు. తిరుమలలో సాయంత్రం 6.30 గంటల సమయంలో గరుడ సేవ మొదలు కాగా.. లక్షలాది మంది భక్తులు రాగా.. గోవింద నామస్మరణతో ఏడుకొండలు మార్మోగాయి. గరుడ సేవ సందర్భంగా మలయప్పస్వామివారికి మకరకంఠి, లక్ష్మీహారాన్ని అలంకరించారు.